English | Telugu
అనుష్క కోసం... రాఘవేంద్రరావు రికమెండేషన్
Updated : Oct 4, 2014
అరుంధతితో అనుష్క రేంజే మారిపోయింది. అది ఇప్పట్లో దిగేలా కనిపించడంలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇప్పుడు స్వీటీనే ఆధారమైపోయింది. పంచాక్షరి, వర్ణ సినిమాలు బ్లాస్ట్ అయినా, అనుష్క బ్లాక్ బ్లస్టర్ సినిమాలు చేయగలదన్న నమ్మకంతో దర్శకులు కథలు రెడీ చేసుకొంటున్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కూడా అనుష్క కోసం ఓ భారీ కథని రెడీ చేసుకొన్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్. నీతో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రకాష్. ఆ సినిమా తుస్సుమంది. ఆ తరవాత బొమ్మలాట తీసి భేష్ అనిపించుకొన్నాడు. అనగనగా ఓ ధీరుడు మాత్రం మళ్లీ నిరాశ పరిచింది. ఇంత కాలానికి ఓ కథని రెడీ చేశాడట. ఇది కూడా మినిమం 50 కోట్ల రేంజ్ ఉన్న కథేనని టాక్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క అయితేనే బాగుంటుందని ప్రకాష్ ఫిక్సయ్యాడు. ఇప్పుడు ప్రకాష్ కథ చెబుతానంటే... అనుష్క వినే స్థితిలో ఉందా?? అందుకే తనయుడు కోసం రాఘవేంద్రరావు సైతం రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారమ్. రాఘవేంద్రరరావు రికమెండేషన్‌తో స్వీటీ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. లేడీఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుష్క నిర్ణయం తీసుకొంది. వర్ణ సినిమా ఎఫెక్ట్ అలా పనిచేసింది. పైగా రుద్రమదేవి, బాహుబలి సినిమాలకు భారీ కాల్షీట్లు ఇవ్వడం వల్ల కొన్ని సినిమాల్ని వదులుకోవలసి వచ్చింది. ప్రకాష్ సినిమాని ఒప్పుకొంటే దాదాపు ఏడాది పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అనుష్క అందుకు సిద్దంగా ఉంటుందా?? లేదంటే కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పాత్ర చాలు అంటుందా?? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి రాఘవేంద్రరావు రికమెండేషన్ ఎంత గట్టిగా పనిచేస్తుందో చూడాలి.