English | Telugu
పిల్లా నువ్వు లేని జీవితం రివ్యూ
Updated : Nov 14, 2014
కాలక్షేపం అన్న మాట సినీ పరిభాషలో చాలా వ్యాల్యుబుల్. దాదాపుగా 90 శాతం ప్రేక్షకులు కాలక్షేపం కోసమే థియేటర్లకు వస్తారు. వాళ్లను కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. మన దగ్గర ఎలాగూ అద్భుతమైన కథ ఉండదు కాబట్టి, ఆ కథనే తిప్పి తిప్పి కాస్త ఆసక్తికరంగా చూపించి, మధ్యలో నాలుగు కామెడీ బిట్లు, ట్విస్టులు వేసుకొని బండి లాగించేయడానికి అటు దర్శకులు, ఇటు రచయితలు నానా తంటాలూ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సూత్రాలతోనే వచ్చిన సినిమా.. ''పిల్లా నువ్వు లేని జీవితం''. కొత్త హీరో సినిమా. ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు కాబట్టి.. సినిమాపై అంచనాలు వేసుకొని వెళ్లేంత సీన్ ఉండదు. అది ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్సయి కూర్చుంది. ఎమ్టీ మైండ్‌తో వెళ్తే... ఈ సినిమా మీరు కోరుకొన్న కాలక్షేపం కోరుకొన్నంత అందించేస్తుంది. మరింతకీ ఈ 'పిల్ల' స్టోరీ ఏంటి?? ఎలా ఉంది??
ప్రబాకర్ (ప్రకాష్ రాజ్) , గంగా ప్రసాద్ (షాయాజీ షిండే) సీ.ఎమ్ సీటు కోసం పోటీ పడుతుంటారు. గంగా ప్రసాద్ అక్రమాలను "y" ఛానల్ జర్నలిస్ట్ షఫీ(షఫీ) ఆధారాలతో సహా రాబడతాడు. దాంతో షఫీని చంపడానికి మైసమ్మ (జగపతిబాబు) రంగంలో దిగుతాడు. కట్ చేస్తే.. పాలకొల్లు శీను (సాయిధరమ్ తేజ్) మైసమ్మని వెదుక్కొంటూ వస్తాడు. నన్ను చంపేయడానికి ఎంత తీసుకొంటావ్? అని మైసమ్మ తో బేరాలు ఆడతాడు. `నిన్ను చూస్తుంటే చంపబుద్ది కావడం లేదు. అసలు నీ కథేంటో చెప్పు` అంటాడు మైసమ్మ. అప్పుడు శీను తన కథ చెప్పడం మొదలెడతాడు. శీను.. సిరి (రెజీనా)ని ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం.. శీనుపై ద్వేషం పెంచుకొంటుంటుంది. అనుకోకుండా సిరిపై ఎటాక్ జరుగుతుంది. ఆమెను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. అసలు సిరిని ఎవరు చంపాలనుకొంటున్నారు? ఈ కథకీ ప్రభాకర్, గంగాప్రసాద్‌లకు సంబంధం ఏమిటి?? శీను మైసమ్మను వెదుక్కొంటూ ఎందుకొచ్చాడు?? అనేదే ఈ సినిమాలోని అసలు ట్విస్టులు.
కొత్త కథని అర్థమయ్యేలా, పాత కథని కొత్తగా చెప్పాలన్నది ప్రాధమిక సినిమా సూత్రం. ఒక విధంగా ఇది అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు లాంటి కథ. కానీ దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రెండు మూడు ట్విస్టులు దాచిపెట్టుకొని కథని రసవత్తరం చేశాడు. అయితే కాస్త బుద్ది, బుర్ర ఉన్నవాళ్లు ఈ కథని ఈజీగానే గెస్ చేస్తారు. అలాంటివాళ్లకు కూడా కథని ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంట్రవెల్‌లో మనం ఊహించిన ట్విస్టు వస్తుంది. హీరో, విలన్‌లు ఛాలెంజ్ చేసుకొని అక్కడో విశ్రాంతి కార్డ్ వేసుకొంటారు.
ఓ ప్రేమ కథకు, యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ జోడిస్తే. అదే పిల్లా నువ్వు లేనిజీవితం. అయితే ఈ సినిమాలో లవ్ తక్కువ.. మిగిలిన రెండూ ఎక్కువ. ఫన్ ఉంటే ఈ రోజుల్లో సినిమా నడిచిపోతుంది. కాబట్టి ఈ పిల్లకు అదే శ్రీరామరక్ష అయ్యింది. సెకండాఫ్‌లో కాస్త కంగాళీ మొదలైంది. తన తెలివితేటలన్నీ ఫస్ట్ ఆఫ్‌లోనే వాడేసిన దర్శకుడు.. సెకండాప్‌లో తప్పు మీద కాలేశాడు. దాంతో కాస్త.. నస పెరుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో మళ్లీ పట్టాలెక్కేశాడు. ఓ భారీ ఫైట్, భయంకరమైన హీరోయిజం చూపించే క్లైమాక్స్ కాదిది. ఆ మాటకొస్తే.. సినిమా అప్పుడే అయిపోయిందేంటి?? అని ప్రేక్షకుడు వెర్రి మొహం వేస్తాడు. ఎందుకంటే క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాలో లేదు. హీరో జిత్తుల మారితనానికి విలన్ బెండైపోయి లొంగిపోవడమే క్లైమాక్స్. అయితే అది కాస్త వర్కవుట్ అయినట్టు కనిపిస్తుంది. రొటీన్ గా ఫైట్‌తో ఎండ్ చేస్తే.. లేని తలనొప్పిని తెచ్చిపెట్టుకొన్నట్టయ్యేది.
ఈ కథలో వెతకాలంటే బోలెడన్ని లూప్ హోల్స్. అవన్నీ వెతుక్కొంటూ పోతే సినిమాలోని ఫన్ ఎంజాయ్ చేయలేం. కాకపోతే దర్శకుడు కాస్త తెలివి ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌లోని స్ర్కీన్ ప్లే, రవిబాబు కామెడీ.. ఈ సినిమాని నడిపించేస్తాయి. ఫస్టాఫ్ స్ర్కీన్ ప్లేని తెలివిగా సెకండాఫ్‌లో రన్ చేశాడు. మరో పాత్రతో. ఈ ప్లాన్ పండింది. సెకండాఫ్‌లో కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు. జగపతిబాబు పాత్రని ఎలివేట్ చేయడానికి ఈ విధానం ఉపయోగపడింది. సెకండాఫ్‌లో పాటల్లేవు. ఒకే ఒక్క ఫైటుతో సరిపెట్టారు. దాంతో.. నస తగ్గినట్టైంది. టీవీ చానళ్లను, మీడియానూ వాడుకొని.. క్లైమాక్స్‌ని భర్తీ చేశాడు దర్శకుడు.
సాయిధరమ్ ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? అనే విషయాలకు క్లూ ఇచ్చిందీ సినిమా. శీను పాత్రని ఈజ్‌గా చేసేశాడు. మెగా హీరోల బలం డాన్సులు.. ఈ విషయంలో సాయి తక్కువోడేం కాదన్న సంగతి అర్థమైంది. డైలాగ్ డెలివరీ కూడా ఓకే. కాకపోతే క్లోజప్‌లో చూళ్లేం. ఆ హెయిర్ స్టైలేంటండీ బాబూ.?? నేను చిరంజీవి మేనల్లుడిని తెల్సా..? నా వెనుక పవన్, చరణ్, బన్నీ ఉన్నారు తెలుసా.. ఇలాంటి డైలాగులేం రాయలేదు... సంతోషం. రెజీనాని సరిగా ఉపయోగించుకోలేదు. ఆమె గ్లామర్, నటన సరిగా వాడుకోలేదు. హీరో, హీరోయిన్లమీద కెమిస్ట్రీ సంగతి అస్సలు పట్టించుకోలేదు. ప్రతి సినిమాలోనూ ఓ బఫూన్ ఉంటాడు. ఆ పాత్రలో ఈసారి ప్రకాష్‌రాజ్ కనిపిస్తాడు. జగపతిబాబు ఓకే. అదే పాత్రలో శ్రీహరి చేసుంటే.. ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. రవిబాబు కామెడీ వర్కవుట్ అయ్యింది. మిగిలినవాళ్లంతా ఓకే.
అరవింద్, దిల్‌రాజుల సినిమా ఇది. నిర్మాణ విలువలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లెద్దు. పాటలు బాగున్నా.. మళ్లీ మళ్లీ వినాలనుకొనేంత సీన్ లేదు. ఆర్.ఆర్ ఓకే. డైమండ్ రత్నం డైలాగుల్లో అక్కడక్కడ పంచ్‌లు పడ్డా.. మెరుపులు తక్కువే. సీన్‌తో పండే వినోదమే ఎక్కువ. రవికుమార్ చౌదరికి ఇది బూస్టప్ ఇచ్చే సినిమా. తన బలం యాక్షన్ సీన్స్. ఈ విషయంలో మరోసారి మార్కులు కొట్టేశాడు. సాదా సీదా కథని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది.
సాయి ఎలా ఉంటాడు?? అని చెప్పుకోవడానికి ఈ సినిమా ఓ డెమోలా ఉపయోగపడుతుంది. సాయి డిజప్పాయింట్ చేయడు.. దాంతో పాటుఈ సినిమా కూడా!! పిల్లకు ఎలాగూ పోటీ లేదు కాబట్టి.. బాక్సాఫీసు దగ్గర నడిచిపోతుంది.
రేటింగ్ 2.75/5