English | Telugu
ఎన్టీఆర్ ఏంటయ్యా ఇదీ...?!
Updated : Feb 9, 2015
ఇంకో నాలుగు రోజుల్లో టెంపర్ రిలీజ్! కానీ ఈ సినిమాపై ఉన్న చిక్కుముడులు ఇంకా వీడలేదు. బండ్ల గణేష్ ఈ సినిమాని పీవీపీకీ, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకీ అప్పగించి ఆర్థిక సమస్యల నుంచి మెల్లి మెల్లిగా బయటపడే ప్రయత్నం చేస్తోంటే, అవి ఇంకా ముదిరి ముదిరి పీక్‌కి చేరాయి. ఆఖరికి ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకొనేలా చేశాయి. ఈరోజో, రేపో సెన్సార్ అనగా.. ఈ సినిమాకి కొత్త టెన్షన్ మొదలైంది. ఈసారి స్వయంగా ఎన్టీఆర్ వల్ల. తనకు రావల్సిన పారితోషికం ఇస్తేగానీ డబ్బింగ్ చెప్పేది లేదని ఎన్టీఆర్ భీష్మించుకొని కూర్చున్నాడని టాలీవుడ్ లో ఓ టాక్ మొదలైంది. చివరి నాలుగు రీళ్లూ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పకుండా వదిలేశాడట. డబ్బులిస్తేనే డబ్బింగ్ అంటూ రూలు పెట్టాడట. దాంతో బండ్ల గణేష్ బెంబేలెత్తిపోయాడు. ఎన్టీఆర్ కాళ్లా వేళ్లా పడినా... కనికరించలేదని తెలిసింది. ఆఖరికి పీవీపీ లాంటి సంస్థ హమీ ఇచ్చినా ఎన్టీఆర్ డబ్బింగ్‌కి రాలేదట. దాంతో ఆఘమేఘాల మీద గణేష్ డబ్బులు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయింత్రం ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన బాకీ మొత్తం అందజేశాడట. దాంతో.. ఈ సినిమా డబ్బింగ్ పూర్తయ్యింది. ఓ స్టార్ కథానాయకుడు అయ్యుండి.. తన సినిమాని చివరి క్షణాల్లో ఇలా టెన్షన్ పెట్టడం ఏమాత్రం న్యాయం?? అంటూ పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంతో గణేష్ - ఎన్టీఆర్‌ల బంధం.. బెడసి కొట్టినట్టే కనిపిస్తోంది. ఎన్టీఆర్ నా బాద్ షా అని చెప్పుకొన్న గణేష్ ఇకపై ఎన్టీఆర్‌తో సినిమా చేయగలడా, గణేష్ కి వరుసగా రెండు అవకాశాలిచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు గణేష్‌ని తన కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనిస్తాడా?? అంత సీన్ లేదనిపిస్తోంది.