English | Telugu

టికెట్లు కొనండి బాబూ... ప్లీజ్‌

హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికి తెలుగు చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేస్తున్న కార్య‌క్ర‌మం మేము సైతం. ఫండ్‌రేజింగ్‌లో భాగంగా డోన‌ర్ కుపన్లు అందుబాటులోకి తెచ్చారు. రూ.500, 3000, 15,000, ల‌క్ష రూపాయ‌లు.. ఇలా నాలుగు కేట‌గిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టికెట్లు అనుకొన్నంత మేర అమ్ముడు కావ‌డం లేదు. రూ.500 విలువ‌ల టికెట్లు దాదాపు ల‌క్ష వ‌ర‌కూ ఉన్నాయి. అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ 20 వేల టికెట్లు కూడా సేల్ కాలేదు. ఛాంబ‌ర్,కౌన్సిల్‌, ఎఫ్ ఎన్ సీసీ వాళ్ల‌కు ఈ టికెట్లు బ‌ల‌వంతంగా అంట‌గ‌డుతున్నార‌ట‌. ఈ టికెట్లు ఎలాగోలా అమ్మి తీరాల్సిందే... మాకు తెలీదు... అంటూ బ‌ల‌వంతం చేస్తున్నార‌ట‌. ల‌క్ష రూపాయ‌ల టికెట్లు 250 వ‌ర‌కూ ఉన్నాయి. అందులో మ‌హా అయితే 50 టికెట్లు అమ్ముడు పోయే అవ‌కాశం ఉంది. స్టార్స్ తో డిన్న‌ర్ చేయ‌డానికి ల‌క్ష రూపాయ‌లు ఎవ‌రిస్తారు? ఈరేటు మ‌రీ టూమ‌చ్‌గా ఉంద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి రూ.3000 ధ‌ర నిర్ణ‌యించారు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లే రూ.500, రూ.1000 ఉంటున్నాయి. ఈ రేటు కూడా ఎక్కువే. దానికి తోడు మూడు గంట‌లు సాగే మ్యాచ్‌కి రూ.3000 ఎందుకు..? డైరెక్ట్‌గా లైవ్‌లో చూడొచ్చు క‌దా అనుకొంటున్నారు. మొత్తానికి టికెట్లు తెగ‌డం లేద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. 30వ తేదీలోపు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతాయో చూడాలి మ‌రి.