English | Telugu

నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత

తెలుగు ప్రజల అభిమాన నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)కి బిగ్ షాక్ తగిలింది. 2010 నుంచి ఎన్నో సినిమా ఫంక్షన్స్ కి, పెళ్ళిళ్ళకి వేదికగా నిలిచిన .హై ప్రొఫైల్ ఎన్‌ కన్వెన్షన్‌ (n convention)ని హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉరఫ్ హైడ్రా కూల్చివేతను ప్రారంభించింది.

మాదాపూర్‌లోని హైటెక్ సిటీ కి దగ్గరలో ఎన్ కన్వెన్షన్ ఉంది. తమ్మిడి కుంట చెరువులోని దాదాపు 3.30 నుంచి 3.40 ఎకరాల్లో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ ను ఆక్రమించి కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారని చాలా ఏళ్ళ నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ సరస్సులోని ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో నిర్మించబడిందనేది ప్రధాన ఆరోపణ. గత కొన్నేళ్లుగా వివాదం కూడా నెలకొని ఉంది.దీంతో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని సరస్సును పునరుద్ధరించాలని హైడ్రా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాడు. దీంతో పోలీసు సిబ్బందిని మోహరించి కూల్చివేతలు చేపడుతున్నారు, కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. మీడియాను కూడా సైట్‌లోకి అనుమతించలేదు.

కన్వెన్షన్ సెంటర్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికతతో కూడిన మూడు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఇది అధికారిక మరియు సామాజిక ఈవెంట్‌ల వంటి అనేక వేదిక ఎంపికలను కలిగి ఉంది. వివాహాలు, నిశ్చితార్థాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం రాజకీయ నాయకులు మరియు సినీ తారల హైప్రొఫైల్ ఫంక్షన్ల కోసం హాల్ అద్దెకు తీసుకోబడుతుంది.