English | Telugu
శహభాష్ జూనియర్!
Updated : Jan 18, 2016
నాన్నకు ప్రేమతో సినిమాలో చంద్రబోస్ రాసిన ఓ పాటుంది..
వాళ్లు నిన్ను విసిరేశామని అనుకొన్నారు... వాళ్లకు తెలీదు నువ్వొక బంతివని...
వాళ్లు నిన్ను పాతేశామని అనుకొన్నారు.. వాళ్లకు తెలీదు నువ్వొక విత్తనమని..
ఇలా సాగుతుందా పాట!
విసిరిందెవరో, పాతేసిందెవరో... ఎన్టీఆర్ అభిమానులకు విడమర్చి చెప్పక్కర్లెద్దు.
నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందు నడిచిన హైటెన్షన్ డ్రామా ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. ఓ వర్గం ఎన్టీఆర్ సినిమా బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిందని ఓ ప్రధాన పత్రిక సైతం కోడై కూసింది. థియేటర్లు దొరక్కుండా కొంతమంది, అసలు ఈ సినిమాకి బయ్యర్లే లేకుండా మరికొంతమంది పావులు కదిపారు. 'ఎన్టీఆర్ సినిమాకి థియేటర్లు ఇస్తే మీ అంతు చూస్తా'మనే రేంజులో ఆ బెదిరింపులు సాగాయని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అంతెందుకు సినిమా రేపే విడుదల.. అన్నప్పుడు పవన్ కల్యాణ్ సైతం.. రంగంలోకి దిగాడు. ''పాత బాకీ చెల్లించి సినిమా విడుదల చేసుకోండి'' అంటూ భీష్మించాడు. పవన్ కల్యాణ్ అంతోడికి రెండు కోట్లు ఓ లెక్కా... అదీ.... ఓ సినిమా విడుదలకు ముందు.. ఈ ఎత్తుగడ నిర్మాతని ఇబ్బంది పెట్టడానికే అన్నది ఎవ్వరికైనా సులభంగా అర్థమయ్యే సంగతి.
ఓ సినిమా బయటకు రాకుండా చేయడానికి ఇన్ని ప్రయత్నాలా? అంటూ సగటు సినీ అభిమాని కూడా విస్తుపోయాడు. ఏదోలా ఎన్టీఆర్ ఆపసోపాలూ పడి, పగలు రాత్రి కష్టపడి.. 24 గంటలూ కంటిమీద కనుకు లేకుండా.. ఈ సినిమా పూర్తి చేశాడు. అక్కడిదో ఎన్టీఆర్ గెలిచేశాడా అంటే లేదు. డివైట్ టాక్ తో ఈ సినిమా బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ని సుకుమార్ సరిగా వాడుకోలేదంటూ కొందరు, ఈ లెక్కల మాస్టారి సూత్రాలు అర్థం కాలేదంటూ మరికొందరు పెదవి విరిచారు. అయినా బుడ్డోడు బుల్డోజరులా దూసుకెళ్లిపోయాడు. 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర... యమ స్పీడుగా పరిగెట్టేసింది. బరిలో బాబాయ్ ఉన్నా, నాగ్ వన్నెచిన్నెలు చూపించినా, ఎక్స్‌ప్రెస్ రాజా అడ్డొచ్చినా బాక్సాఫీసు దగ్గర బుడ్డోడి స్పీడుకు బ్రేకులు వేయలేకపోయారు. ఇప్పటి వరకూ దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. ఇన్ని ప్రతికూలతల మధ్య.. ఎన్టీఆర్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఓవర్సీస్‌లో అయితే.. దుమ్ముదులిపి కొత్త రికార్డులకు దారులు వేసుకొంటూ వెళ్తోందీ చిత్రం.
సినిమా ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ పై సానుభూతి పవనాలు ఓ రేంజులో పనిచేశాయన్నది విశ్లేషకుల మాట. ''ఎన్టీఆర్‌ని వాడుకొన్నంత కాలం వాడుకొన్నారు.. ఇప్పుడు తొక్కేద్దామని చూస్తారా'' అంటూ అభిమానులు కానివాళ్లు కూడా ఆక్రోశించారు. దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం పడిన కష్టం కళ్లముందు కనిపించింది. మాస్ హీరో కదా అని కత్తి పట్టి, నాలుగు డైలాగులు చెప్పి వెళ్లిపోయే కథ ఎంచుకోలేదు. నిజాయతీగా ఓ మంచి ప్రయత్నం చేశాడు.. దానికీ బాగానే ఓట్లు పడ్డాయి. విసిరేసిన బంతి అంతకంటే స్పీడుగా వెనక్కి దూసుకొచ్చినట్టు.. ఎన్టీఆర్ లేచి నిలబడ్డాడు. పాతేద్దామనుకొంటే విత్తనమై, భూమిని చీల్చుకొచ్చి మొక్కలా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలబడ్డాడు. అది చాలదూ.. ఎన్టీఆర్ అభిమానులకు. అందుకే మరోసారి చంద్రబోస్ రాసిన పాటని మననం చేసుకొంటూ... శభాష్ జూనియర్ అంటూ... ఈ టాలీవుడ్ బాద్ షాకి నీరాజనాలు అందిస్తున్నారు...!