English | Telugu
ఏంటిది జక్కన్న.. మహేష్ బాబు సినిమాకి ఈ టైటిలా..!
Updated : Jul 25, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రూపొందనుంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో 'SSMB 29'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించి, షూట్ ప్రారంభించే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఒక ఊహించని టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
'SSMB 29'కి 'మహారాజా' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీకి 'గోల్డ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మామూలుగా రాజమౌళి సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. 'సింహాద్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'మగధీర', 'బాహుబలి' ఇలా పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టి.. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం రాజమౌళికి అలవాటు. అయితే ఇప్పుడు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేస్తున్న అత్యంత భారీ చిత్రానికి 'గోల్డ్' అనే టైటిల్ పెట్టారనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం రాజమౌళికి గ్లోబల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. కాబట్టి గ్లోబల్ రీచ్ ఉండేలా 'SSMB 29' సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ పెడతారు అనడంలో సందేహం లేదు. అయితే 'గోల్డ్' టైటిల్ అనేది క్లాస్ గా ఉంది. ఇండియన్ ఆడియన్స్.. అందునా తెలుగు ప్రేక్షకులు.. ఈ క్లాస్ టైటిల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఏదైనా సినిమా చేస్తుంటే.. దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై రాజమౌళి ఎంతో కేర్ తీసుకుంటారు. అలాంటిది సినిమాకి ఎంతో ముఖ్యమైన టైటిల్ విషయంలో ఆయన ఎంత ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మహేష్ బాబు సినిమాకి నిజంగానే 'గోల్డ్' అనే టైటిల్ ఖరారు చేశారా లేదా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.