English | Telugu
బాక్సాఫీస్ ఉగ్రరూపం.. వంద కోట్ల దిశగా మహావతార్ నరసింహ!
Updated : Aug 1, 2025
ఎప్పుడు ఏ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చెప్పలేము. ఒక్కోసారి పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి. ఇటీవల విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రం ఆ కోవలోకే వస్తుంది. జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. (Mahavatar Narsimha)
'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు వస్తాయని.. మొదటి సినిమా 'మహావతార్ నరసింహ' ఈ ఏడాది వస్తుందని.. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.
'మహావతార్ నరసింహ' చిత్రం జూలై 25న విడుదలైంది. విడుదలకు ముందురోజు వరకు ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ లో కానీ.. ఈ సినిమాపై అంచనాలు లేవు. అందరూ దీనిని ఒక మామూలు యానిమేషన్ సినిమాలాగే చూశారు. అయితే ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.
'మహావతార్ నరసింహ' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. మొదటి వారంలోనే ఈ చిత్రం రూ.53 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రేక్షకులు థియేటర్ బయట చెప్పులు విప్పి మరీ లోపలికి వెళ్తున్నారంటే.. ఈ సినిమాకి వారు ఎంతలా కనెక్ట్ అవుతున్నారో అర్థంచేసుకోవచ్చు. మొత్తానికి, స్టార్స్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకోవచ్చని 'మహావతార్ నరసింహ' మరోసారి రుజువు చేసింది.