English | Telugu

ర‌వితేజతో నిఖిల్ ద‌ర్శ‌కుడి చిత్రం.. ప‌ర‌శురామ్ బాట‌లో కార్తిక్!?

యంగ్ హీరో నిఖిల్ న‌టించిన `యువ‌త‌` (2008)తో ద‌ర్శ‌కుడైన ప‌రశురామ్.. ఆపై త‌న ద్వితీయ చిత్రాన్ని మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో `ఆంజ‌నేయులు` (2009)గా తీశాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడిదే బాట‌లో మ‌రో నిఖిల్ ద‌ర్శ‌కుడు వెళ్ళ‌నున్నాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఏడేళ్ళ క్రితం నిఖిల్ క‌థానాయ‌కుడిగా `సూర్య వ‌ర్సెస్ సూర్య‌` (2015) అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని తెర‌కెక్కించిన కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని.. సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌రో చిత్రాన్ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఇందులో ర‌వితేజ హీరోగా న‌టిస్తార‌ని స‌మాచారం. అంతేకాదు.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ర‌వితేజ - కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానుంది.

కాగా, స్వ‌త‌హాగా సినిమాటోగ్రాఫ‌ర్ అయిన కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని గ‌తంలో ర‌వితేజ న‌టించిన `డిస్కో రాజా` (2020)కి ఛాయాగ్ర‌హ‌ణం అందించాడు. అలాగే, ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న `ధ‌మాకా`కి కూడా త‌నే కెమెరామేన్. మ‌రి.. ర‌వితేజ‌తో తీయ‌బోయే సినిమాతోనైనా కార్తిక్ ద‌ర్శ‌కుడిగా విజ‌యాన్ని అందుకుంటాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే, ర‌వితేజ తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుండ‌గా.. `ధ‌మాకా`, `రావణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.