English | Telugu
60 రోజుల్లో 3 చిత్రాలుః కార్తి ప్లానింగ్ అదిరింది గురూ!
Updated : May 26, 2022
ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడేసి సినిమాలతో పలకరించడం కోలీవుడ్ స్టార్ కార్తికి కొత్తేమీ కాదు. 2010, 2013, 2019 సంవత్సరాల్లో ఇలా మూడేసి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు కార్తి. కట్ చేస్తే.. ఇప్పుడు 2022లోనూ ముచ్చటగా మూడు సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. విశేషమేమిటంటే.. వరుసగా మూడు నెలల పాటు విడుదల కానున్న ఈ చిత్ర త్రయాలు.. కేవలం 60 రోజుల్లోపే తెరపైకి రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ముత్తయ్య దర్శకత్వంలో కార్తి నటించిన విలేజ్ డ్రామా `విరుమన్` ఆగస్టు 31న విడుదల కానుండగా.. దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన ఎపిక్ పిరియడ్ డ్రామా `పొన్నియన్ సెల్వన్ః 1` సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇక పి.ఎస్. మిత్రన్ నిర్దేశకత్వంలో కార్తి ద్విపాత్రాభినయంతో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ `సర్దార్` దీపావళి కానుకగా అక్టోబర్ నాలుగో వారంలో జనం ముందుకు రానుంది. అంటే.. కేవలం 60 రోజుల్లోపు మూడు చిత్రాలతో కార్తి ఎంటర్టైన్ చేయనున్నాడన్నమాట. మరి.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ - ఇలా నెలకో సినిమాతో వినోదాలు పంచనున్న కార్తి.. ఆయా చిత్రాలతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.