English | Telugu
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్.. సీక్రెట్ గా ఉంచారా..?
Updated : Aug 14, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలొస్తున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారని న్యూస్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం అనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన టీం తెలిపింది. "ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎడమ మణికట్టు బెణికింది. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేశారు. అది చిన్న గాయమే.. ఎవరూ ఆందోళన చెందవద్దు" అని టీం పేర్కొంది.
ఎన్టీఆర్ టీం ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లోనే ఆయన తండ్రి హరికృష్ణ, సోదరుడు జానకిరామ్ మరణించారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అందుకే తాజా వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, జిమ్ లో స్వల్ప గాయమైందని టీం చెప్పడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.