English | Telugu
వీరమల్లు బిజినెస్.. ట్రైలర్ దెబ్బకు లెక్కలు తారుమారు!
Updated : Jul 6, 2025
తెలుగునాట తిరుగులేని స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. సినిమాల పరంగా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ మొదటిసారి 'హరి హర వీరమల్లు' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పైగా ఇది హిస్టారికల్ ఫిల్మ్. అందుకే పలుసార్లు వాయిదా పడినా.. వీరమల్లుపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్.. వీరమల్లుపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'హరి హర వీరమల్లు' సినిమా థియేట్రికల్ బిజినెస్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)
నైజాంలో వీరమల్లు థియేట్రికల్ రైట్స్ ను నిర్మాతలు రూ.65 కోట్లు చెబుతున్నట్లు సమాచారం. నైజాంలో పవన్ కి మంచి పట్టుంది. ఆయన సినిమాలు ఇక్కడ అదిరిపోయే వసూళ్లు రాబడుతుంటాయి. దానికి తోడు ఈమధ్య పలు పాన్ ఇండియా సినిమాలు నైజాంలో భారీ వసూళ్ళు రాబట్టాయి. దీనిని బట్టి చూస్తే.. రూ.60 కోట్లకు అటూఇటూగా వీరమల్లు నైజాం బిజినెస్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి చిత్రం కావడంతో.. ఆంధ్రా, సీడెడ్ లో కలిపి వీరమల్లు సుమారుగా రూ.100 కోట్లు బిజినెస్ చేసే అవకాశముంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే వీరమల్లు మూవీ ఏకంగా రూ.160 కోట్ల బిజినెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి 'హరి హర వీరమల్లు' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిసినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది.