English | Telugu

విధాత తలపు


బాపుగారి బాడే ఇవాళ!
బాడే’ అంటే మరేం లేదు. బర్త్‌డే.
మరి బాపు అంటే? హూ ఈజ్‌ హీ?
మరీ అంత అన్యాయమైన ప్రశ్నేం కాదు.
సమాధానాలే.. హీనం! విహీనం!
ఫిల్మ్‌ డైరెక్టర్‌ అంటారు.. ఇలస్ట్రేటర్‌ అంటారు.
కార్టూనిస్ట్‌ అంటారు... పెయింటర్‌ అంటారు.
డిజైనర్‌ అంటారు... పద్మశ్రీ అంటారు.
ఇక ` బర్త్‌డేనిబాడే’ అంటే తప్పా...
బర్త్‌డే పార్టీని ‘బాడే పాటీ’ అంటే తప్పా...
క్యాచ్‌ చెయ్యలేని జనరేషన్‌ అయితే
‘అమ్మో! బాపుగారి బొమ్మో’ అని రాగం తీసి,
ఆయనే కదా అంటారు!
బాపుగారిలో ఎంతుందో అంతా తెలిసిపోయింది లోకానికి.
బాపుగారిలో... ఏం లేదో కూడా తెలుసుకుంటేనే
‘బాపుగారంటే ఎవరు’ అనే ప్రశ్నకు కరెక్ట్‌ ఆన్సర్‌ దొరుకుతుంది.
ఆన్సర్‌ ఆల్రెడీ శ్రీరమణ దగ్గరుంది.
తారలకు తార అయిన బాపుగారి అంతరంగమూ...
ఆ ఆన్సర్‌లోనే ఉంది.


అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు. అందమైన ద్వంద్వ సమాసంగా ఆ జంటని సమాదరించారు. బాపు`రమణల స్నేహరాసిక్యతకు నిండుమనసుతో నీరాజనాలెత్తారు. వారిద్దరు కారు ఒక్కరేనని తీర్మానించారు ` తెలుగువారు.
ఇవ్వాళ బాపు పుట్టినరోజు. అరవై అయిదేళ్ల చిత్రకారుడు. యాభై ఏళ్ల చలనచిత్రకారుడు ఆయనలో వున్నారు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆ కళాప్రపూర్ణుడికి యీ పండుగవేళ అశేష అభిమానుల పక్షాన ‘తెలుగువన్‌’ శుభాకాంక్షలు అందిస్తోంది. రమణ ఎక్కడున్నా ఆనందించి ఆశీర్వదిస్తారు. ఇది నిజం.


బాలానంద సంఘం నుంచి బాల పత్రికలోంచి బాపు బొమ్మల కథ మొదలైంది. తర్వాత సాధనమున పనులు సమకూరి, నూత్నయవ్వన దశలోనే కవర్‌ డిజైన్లు, కామిక్సూ, కార్టూన్లు వేయడం మొదలుపెట్టారు. కొందరు రసజ్ఞులు ఎవరీ ఆర్టిస్టు, ఏమా కథ అంటూ కనుబొమలు ఎగరేశారు. అప్పట్నించీ బాపు గీతలు మాట్లాడడం, నవ్వడం, ఎగతాళి చేయడం, ముక్కున వేలేసుకోవడం నేర్పాయి. జాణ తనమూ, నెరజాణ తనమూ ఆ గీతలకు అబ్బింది. తెలుగుతనపు నైజాలు ఆ గీతకు పుట్టుకతోనే వచ్చాయి. ‘లైను బావుంది. గీతలు పదునుగా వున్నాయి, బొమ్మలో బ్రెవిటీ ఉంది, ఎనాటమీ మీద పట్టుంది, ఎవడోయ్‌ ఆ సంతకం’ అంటూ గొప్పగొప్ప పేర్లున్న వారంతా కళవరపడ్డారు. బాపుని చూశాక, ‘‘ఓ వెరీ సింపుల్‌, ఇంకొంచెం పొడుగు సాగడానికి కూడా మొహమాటపడ్డాడులా వుంది’’ అనుకున్నారు. పర్వాలేదు. పైకొస్తాడని పబ్లిగ్గానే అనేశారు. 1955లో ఆంధ్రపత్రికలో పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా చోటు సంపాదించారు. ‘మనవాళ్లు’ శీర్షికను జేబు కార్టూన్‌లో ‘గిరీశం’ పేరు మీద స్ట్రిప్‌ కార్టూన్లూ పేల్చారు. తెలుగునాట యిలాంటి శీర్షికకు మంచి ప్రాచూర్యం వచ్చింది. వీటిలో ఛందస్సూ, వ్యాకరణమూ, అలంకారమూ కూర్చింది మనవాళ్లేనని చెప్పడానికి, చెప్పుకోవడానికి మనం వెనకాడక్కర్లేదు.

‘బాపు’ తండ్రి పెట్టుకున్న ముద్దుపేరు

సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే బాపు పేరుకు తెలుగువాడే కాని, పుట్టింది ప.గో.జి. నరసాపురమే గాని పెరిగింగీ చదివిందీ యావత్తూ మద్రాసులోనే. తండ్రి వేణుగోపాలరావు వృత్తిరీత్యా లాయరు. లక్ష్మీ నారాయణ లాయర్‌ కావాలని తండ్రి ఆకాంక్ష. ‘బాపు’ తండ్రి పెట్టుకున్న ముద్దుపేరు. ఆయన నోటి వాక్యాన బాపు పేరు ఇంటింటి పేరు అయింది. ఖండాంతరాలలో కూడా యీ పేరు అభిమానులను సంపాయించుకుంంది. ఆ తరువాత భాగ్యవతిని పెళ్లాడి ఓ ఇంటివారయ్యారు. అది పందొమ్మిది వందల ఫిఫ్టీసిక్స్‌. పెళ్లికూతురు గోవిందరాజుల సుబ్బారావు గారి అమ్మాయి. కొన్నాళ్లు ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరోలో జర్నలిస్టుగా పనిచేశారు. బాపు గీత అన్ని భాషా పత్రికలలోనూ విరివిగా కనబడి తీరిక లేకుండా అందరినీ అలరించడం మొదలుపెట్టింది. వ్యాపార ప్రకటనలు అందించే అడ్వర్టయిజింగ్‌ సంస్థలు ‘ఎవడీ గీత’ అని వాకబు చేశాయి. ఎఫ్‌.డి. స్టివార్డ్‌, జె.వాల్టర్‌ థాంసన్‌, ఎఫిషెంట్‌ పబ్లిసిటీస్‌లలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో అంటే యాభై దశకం చివరల్లో అత్యధిక వేతనం పుచ్చుకోగల ఆర్టిస్టు అయ్యారు బాపు. అప్పట్లో నెలకు రెండున్నర వేల రూపాయలు. అంటే యాభై, అరవై తులాల బంగారం వెల కావచ్చు. ఆ రోజుల్లోనే గోపులుతో పరిచయం ఏర్పడిరది. చిత్రకారునిగా గోపులు పేరు తమిళనాట చాలా ప్రసిద్ధి. కాదు బాపుయే నా గురువని సకారణంగా వివరించే వారు.


బాపుకి గురువులెవరూ లేరు

ఆరుద్ర ‘వెన్నెల వేసవి’ పుస్తకానికి గోపులు గారితో బొమ్మలు వేెయించారు బాపు. గోపులు ‘యాడ్‌ వేవ్‌’ అనే అడ్వర్‌టైజింగ్‌ సంస్థని స్వయంగా ప్రారంభించుకోడానికి బాపు ప్రోద్బలమే కారణమని చెబుతారు. నిజానికి బాపుకి గురువులెవరూ లేరు. తండ్రిగారి ఫ్రెండు ఎస్‌.ఆర్‌.చామకూర అంటే చామకూర సత్యనారాయణ దగ్గర నేర్చుకున్నారనే వదంతి వుంది. చామకూరకి పోట్రెయిట్‌ పెయింటర్‌గా గొప్పపేరు వుండేది ఆ రోజుల్లో. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు లాంటివారు చామకూరతో తమ బొమ్మ రాయించుకోవడం ఒక వైభవంగా భావించేవారు. బాపు వారిని, వారి బొమ్మల్ని చూడడమే తప్ప శిష్యరికమెరుగరని దగ్గరగా చూసిన రమణ చెబుతుండేవారు. అయితే బాగా బొమ్మలు వేసేవారంతా నా గురువులేనని బాపు తరచు చెబుతుంటారు. ఉమేష్‌ రావని బాపుతో ఏజెన్సీలో పనిచేసేవారు. ఎయిర్‌ ఇండియా మహరాజా రూపురేఖల్ని దిద్దింది ఉమేష్‌రావు గారే. ఒక్కోసారి ఉమేష్‌రావు నా గురువు గారటుంటారు గాని యిదీ ఆరోపణే. కొందరు ‘వీరాభిమానులు ‘‘మీకు ఏ గురువూ లేకపోవడం, ఏ ఆర్ట్స్‌ కాలేజీలోనూ చదవకపోవడమే మీ ప్రత్యేకత. మీ స్ట్రోకు, మీ లైను, మీ...’’ అంటుంటారు.


బాపుకి చిర్రెత్తుకొస్తుంది. ‘‘అయ్యా, ఎక్కడా నేర్చుకోపోవడం వల్ల నాకున్న ఇబ్బంది నాకు తెలుసు. నా చేతకానితనం నాకు తెలుసు. దయచేసి ఇలాంటి సాంబ్రాణి పొగతో నన్ను ఊదరపెట్టకండి’’ అనే జవాబు వాడిగా వస్తుంది. ఇది కొనితెచ్చుకున్న వినయంకాదు. బాపుకి చాలా యిష్టమైన మొక్కపాటి, పిలకా నరసింహమూర్తి చిత్రాల గొప్పదనాన్ని సాకల్యంగా చెప్పేవారు. రేఖల్లో రంగుల్లో వుండే స్థాయీ భేదాలు అంటే మంద్రంగా పెంచుకున్నారు. ఎందరో సుప్రసిద్ధుల బాణీలను ఆస్వాదించి అనుభవించి, పరవశించడంతోబాటు నిరంతర సాధనలో బాపు కళాప్రపూర్ణుడన్న మాటని స్వభావోక్తిగా మార్చారు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఫాక్స్‌మిల్‌ ఎడిషన్‌ని డాక్టర్‌ గూటాల కృష్ణమూర్తి లండన్‌ నుంచి వెలువరించారు. ఆ ఎడిషన్‌కి బాపు బొమ్మలు వేశారు. అప్పుడు బాపు అన్న మాటలివి ` ‘‘ఆర్థర్‌ రాఖామ్‌, రెజినాల్డ్‌ క్లీవర్‌, గిల్బర్ట్‌ విల్క్‌న్‌సన్‌, ఇ.హెచ్‌. షేపర్డ్‌, ఇల్లింగ్‌వర్త్‌ వంటి ‘గీతో’పనిషత్‌ అథారిటీలు, పసిబిడ్డల కోసం ఫెయిరీటేల్స్‌ నుంచి బ్రహ్మాండం దాకా అద్భుతమైన ‘గీతా’రచనలు చేసి సిద్ధులై, జగత్‌ ప్రసిద్ధులై చిత్రకళకు పెద్ద బాలశిక్షలై, వేదాలై, చిరంజీవులై విలసిల్లే గురుతుల్యులు వెలసిన దేశంలో అచ్చయే ఇంకో గొప్ప పుస్తకానికి నేను బొమ్మలు గీయడం నా అదృష్టం’’.

పోత అక్షరాల విప్లవం మొదలైంది

అరవైలో రమణ సినిమా రంగ ప్రవేశం చేశారు. బాపు అప్పుడప్పుడు సరదాగా సినిమాలకు పబ్లిసిటీ చిత్రచిత్రంగా చేస్తుండేవారు. బాపు ఫ్రీస్టయిల్‌ అక్షరాలు వెల్లువగా వచ్చేశాయి. గుండ్రంగా రాయడానికి మనమెందుకు, పోత అక్షరాలను కంపోజ్‌ చేసుకోవచ్చు కదా అంటూ విప్లవించాడు బాపు. ఇంక అంతే! పుస్తకాల నిండా పత్రికలలో శీర్షికలు, సినిమా పోస్టర్లలో, సైన్‌బోర్డులూ అన్నిటా బాపు చేరాతలు నిండిపోయాయి. ప్రింటింగ్‌ ప్రెస్‌లవారు గిరాకీని గమనించి బాపు అక్షరాల్ని పోతలు పోయించారు. డెస్క్‌టాప్‌ ప్రింటింగ్‌ వచ్చాక రకరకాల బాపు వొరవళ్లని సాప్ట్‌వేర్‌గా రూపొందించేశారు. ఇప్పుడు బాపు బ్రష్‌, బాపు నిబ్‌ లాంటి రకరకాలు. అక్షర చరిత్రలో లిపి పరంగా ఒక నూతన అధ్యాయాన్ని సృజించిన బాపు అ`క్షరం. ‘జ్యోతి’ మంత్లీ బాపు రమణల ఆలోచన. బెజవాడ కార్యస్థానంగా ప్రారంభమైన ‘జ్యోతి’ అఖండంగా వెలిగింది. ప్రతి సంచికలోనూ బాపు బొమ్మలే. నాటి తెలుగు పుస్తక ప్రియులకు ‘జ్యోతి’ ఒక మధురానుభూతి. ‘జ్యోతి’ కోసమే బాపు కొన్నాళ్లు బెజవాడలో కాపరం పెట్టారు.

‘సాక్షి’ ఇలా మొదలైంది...

భాషా భేదం లేకుండా మంచి సినిమాలు చూడడం, బావుంటే నచ్చితే మళ్లీ మళ్లీ చూడడం మొదట్నించీ బాపు అలవాటు. థియేటర్‌లోంచి బయటకు రాగానే తనలోని ఓ భావుకుడు బయటకొచ్చి, ‘నేనైతేనా...’’ అంటూ తన పద్ధతిలో సినిమా చూపేవాడు మనసు తెర మీద. ఆ భావుకుడి ప్రేరణతో నిజంగా వెండితెరమీద సినిమా తీయాలని కోరిక పుట్టింది. ఆ కోరిక రమణ అంగీకారంతో సంకల్పమైంది. 1967లో ‘సాక్షి’గా కావ్యరూపం దాల్చింది. బాపు చిత్రకారుడే కాదు గొప్ప చిత్ర దర్శకుడన్నారు. చాలా తక్కువ ఖర్చుతో అంటే రెండున్నర లక్షల్లో సాక్షి చిత్రం పూర్తయింది. డైరెక్టర్‌తోబాటు నటీనటులు, సాంకేతిక వర్గానికి మంచి పేరు తెచ్చింది. తాష్కెంటు ఫిలిం ఫెస్టివల్‌కి ఎంపిక అయింది. సినీ జనులు బాపుని తొలి చిత్రంతోనే అభిమానించారు.

బాపు తొలిప్రేమ బొమ్మలు వేయడం

బాపు తొలిప్రేమ బొమ్మలు వేయడం. వేస్తూ సంగీతం వినడం. మనసా కర్మణా పైపు కాల్చడం. ఆనక పైపు మానెయ్యక తప్పలేదు. పైపుల్లో మంచి కలెక్షను ఉండేది. ఆయన దగ్గర హీనంగా వెయ్యి పైపులు ప్రశస్థమైనవి ఉండేది. అదొక చిన్న మ్యూజియంలా ఉండేది. ‘‘ఎలా మానేశారు పాపం’’ అని మిత్రులు అడిగితే ‘‘ఏవుంది నేవెళ్లి ఆస్పత్రిని తల్చుకుంటా. పైపు మీద విరక్తి వచ్చేస్తుంది’’ అనేవారు. చిన్న చిన్న సరదాలన్నీ ఉన్నా సకాలంలో వర్జించారు. ‘‘వర్జించాల్సింది కాబట్టి వర్జీనియా టుబాకో’’ అన్నారు ఆరుద్ర. అయితే, సినిమాలలో తాగుడు, సిగరెట్‌ కాల్చడాన్ని గ్లోరిఫై చేస్తూ చూపడాన్ని బాపు వ్యతిరేకించేవారు. మనకి అలవాటై ఇష్టమున్నంత మాత్రాన అవేవీ మంచివి కావు. ఆ నియమాన్ని నమ్మి ఆచరించేవారు. మంచి భోజన ప్రియుడు. క్వాంటిటీ కాదు క్వాలిటీ. బాపు ` రమణల భోజన ప్రియత్వం చెప్పనలవి కాదు. అదొక ప్రత్యేక కావ్యం !

ఎక్కడ చూసినా బాపు బొమ్మె...

సినిమాలలో వత్తిడిగా ఉన్నా బొమ్మలు వేయడం ఎప్పుడూ మానలేదు. బాపు బొమ్మకి షష్టిపూర్తి ఎప్పుడో జరిగిపోయింది. పట్టుదలతో సాధనతో బాపు మొదటి స్థానాన్నే కాదు రెండూ మూడూ స్థానాల్ని కూడా సొంతం చేసుకున్నారు. దీనికి ఆయనకు తెలిసిన అడ్డదారి సదా సాధన. దాదాపు ముఫ్పై ఏళ్లపాటు ఏ తెలుగు పుస్తకమూ బాపు ముఖచిత్రం లేకుండా రాలేదు. బుక్‌షాప్‌కి వెళితే బాపు బొమ్మల ప్రదర్శనలా ఉండేది. బాపు బొమ్మ చూడ్డానికే కాదు అమ్మకానికి సైతం ఆకర్షణ. తెలుగునాట పత్రికల కథలకీ సీరియల్స్‌కీ బాపు బొమ్మలు తప్పనిసరి. ‘‘ఎవరండీ ఈ బాపు. మేం పది పేజీల్లో చెప్పిందాన్ని నాలుగ్గీతల్లో చెప్పి పైగా పైసంగతి వేస్తున్నాడు’’ అని రావిశాస్త్రిలాంటివారు నిందాస్తుతి చేయడం నాటి ముచ్చట. ఇక బాపు కుంచెతో క్రొక్విల్‌తో చేసిన చమక్కులు అన్నీ ఇన్నీ కాదు. చాలా ఏళ్ల క్రితం స్క్రిప్ట్‌ ఆర్ట్స్‌వారు పండగలకీ పబ్బాలకీ గ్రీటింగ్‌ కార్డులు వేసేవారు. అవన్నీ బాపు తయారించినవే. ఉదాహరణకి సంక్రాంతికి ముందు ఒక సెట్‌ విడుదలయేది. అందులో సంక్రాంతి సంబరాలన్నీ బాపు వర్ణచిత్రాల్లో పలకరించేవి. ఇలా ప్రత్యేక పర్వాలకు పండగలకు నిజానికి నగరాలకే పరిమితమైన ఈ గ్రీటింగుల సంస్కృతి గ్రామాలకు పాకింది ఈ స్క్రిప్ట్‌ ఆర్ట్స్‌తోనే. తర్వాత అభినందన వారివి వచ్చి అలరించాయి. ఎన్నో పత్రికలకు లోగోలు బాపు డిజైన్‌ చేసినవే.

బాపు చిత్రకారుడుగా చేసిన తపస్సు ఫలించింది. ఆయన రామాయణాన్ని కనీసం ఎనిమిది సార్లు సచిత్రపరిచి ఉంటారు. ఇతిహాసాలు, ప్రబంధాలు, మహాకావ్యాలు వీటన్నిటికీ బాపు రేఖ ముఖమండపంగా అమరింది. 1979లో కటాక్షించి శ్రీవేంకటేశ్వరుడు తన ఆస్థాన చిత్రకారున్ని చేశాడు. అన్నమయ్య పదాలకు బాపు బొమ్మలు.. బంగారానికి తావి లాంటివి. శంకరమంచి సత్యం ‘‘అమరావతి కథలు’’, అందునా బాపు బొమ్మల్ని గుర్తు చేసుకుంటారందరూ. గిరీశం, బుడుగు, బారిష్టర్‌ పార్వతీశం లాంటి తెలుగు ప్రముఖులకు రూపకల్పన చేశారు. నాడు ఆంధ్రవార పత్రిక ‘తెలుగు వెలుగులు’ శీర్షికకు డెభై అయిదుమంది ప్రముఖుల రేఖా చిత్రాలను బాపు గీశారు. పోట్రెయిట్‌ అంటే అచ్చం ఆ మనిషిలానే ఉండడమని చాలామంది అపోహ పడతారు. అలాంటప్పుడు క్షణంలో ఫొటోనే దిగచ్చు కదా. బాపు పోట్రెయిట్‌ వేస్తే వారి తాలూకు వ్యక్తిత్వం రేఖల్లో రంగుల్లో లీలామాత్రంగా స్ఫురిస్తుంది. రాముడు, కృష్ణుడు బాపుతో ఎన్నో పోట్రెయిట్‌లు వేయించుకున్నారు. కథల ఇలస్ట్రేషన్స్‌లో ముఖ్యంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ బాపుకి తిరుగులేదంటారు. ఆ రోజుల్లో కొత్త కలాలు కవితలకు, మినీ కవితలకు బాపు అందించిన బొమ్మలు అనితర సాధ్యాలు. బాపు చిత్రించిన సీతారాముల తలంబ్రాలు ఘట్టంతో, వినాయకుడి బొమ్మతో ఎన్నో లక్షల పెళ్లి శుభలేఖలు వచ్చాయి, వస్తున్నాయి’’. బాపు రేక పండిరది’’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి యాభై ఏళ్లనాడే దీవించారు. బాపు బొమ్మలు వస్త్రాల మీదకు, పింగాణి కప్పులు, ప్లేట్ల మీదకు, వెండి షీల్డ్‌ల మీదకు, బంగారు రాగి పతకాల పైకి వెళ్లాయి. సంస్థల లోగోలు, విజిటింగ్‌ కార్డులు, బుక్‌ మార్క్‌లు ఇలా రవిగాంచని చోట కూడా బాపు బొమ్మ కాంచుతుంది. బాపు ముగ్ధల్నీ, ప్రౌఢల్నీ పరమ రమణీయంగా గీస్తారని ప్రతీతి. ‘‘బాపు లేడీస్‌ని దోపిడీకి గురిచేస్తున్నారని ఒక (ఎక్స్‌ప్లాయిట్‌ అని ఆంగ్లము) ఫెమినిష్టూరమాడిరది’’ ఇంకా అప్పడాల కర్ర దగ్గరే ఆగిపోయాడు బాపు’’ అని ఒకావిడ నోరు చేసుకుంటే వెంఠనే అప్పడాల కర్ర తీసేసి సైకిల్‌ చైన్‌ వేశారు. ‘శివ’ స్ఫూర్తితో. బాపు ఇష్టాలు, అయిష్టాలు కూడా తీవ్రంగా ఉంటాయని వినికిడి.

బాపు పంచప్రణాలు ఏమిటో తెలుసా...

'ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎమెస్కో వారి ఇంటింటి సొంత గ్రంథాలయం పుస్తకాలకు బాపు వేసిన బొమ్మలు ఎత్తున్నర. టైటిల్‌, ఇన్నర్‌ టైటిల్‌ చూసినవారికి వదలక వెంటాడతాయి. ఈజెన్‌బర్గ్‌ అనే ఒక పెద్దాయన ఫోర్డు ఫౌండేషన్‌ తరపున పుస్తక ప్రచురణకు దోహదపడడానికి దక్షిణ భారతానికి నియమితులైనారు. ఆ జూయిష్‌ దొరకి బాపు అంటే చాలా ఇష్టం. బాపుకి ఆయనంటే చాలా గౌరవం. బాపుని దేశమంతా తిరిగి, నచ్చినవాటికి ఫొటోలు తీసుకురమ్మని భారతయాత్రకు పంపారు. బాపు మంచి ఫొటోగ్రాఫర్‌. నిపుణత గల కారు డ్రైవరు. వేగం, భద్రత, నిర్దిష్టత మా ప్రత్యేకత! ఈజెన్‌బర్గ్‌ ఓ సారి బాపు డ్రైవింగ్‌లో వెళుతూ, ‘‘బాపు! యు ఆర్‌ ఫ్లైయింగ్‌ వెరీ లో’’ అని చమత్కరించారు. బాపు దర్శకుడు అయ్యాడని తెలిసి ఆయన చాలా ఆనందించారు. ఎందరో మహానుభావులు నన్ను ప్రభావితం చేశారంటూ బాపు వారందరినీ చల్లటి వేళ స్మరించుకుంటారు. బొమ్మలువేయడం, చదవడం, సంగీతం, సినిమాలు, వెంకట్రావ్‌ ఇవి బాపు పంచప్రాణాలు. బాపు షష్టిపూర్తి నాటికి అందాజ్‌గా లెక్కేస్తే లక్షాయాభైవేల బొమ్మలు వేశారని తేలింది. చిన్నాపెద్దా వెరసి ఇప్పటికి రెండు లక్షలు ఉండొచ్చు. బాపు సినిమాలకు కూడా స్టోరీ బోర్డు వేసుకోవడం అలవాటు. దాదాపు ప్రతి ఫ్రేమూ రేఖల్లో ముందు వేసుకుంటారు. శ్రీరామరాజ్యం, భాగవత కథలు సీరియల్‌కీ బాపు గీసిన, గీసుకున్న బొమ్మల గురించి ప్రస్తావించడం బాపుకి ఇష్టం ఉండదు. ‘‘అదేమీ విశేషం కాదు, అది కేవలం నా వీలు కోసం నేను చేసుకునే ఏర్పాటు. అదీ కాస్తో కూస్తో గీతలు వచ్చు కాబట్టి’’ అంటారు. ఈ సందర్భంలో బాపు శ్రద్ధకి, ఓపికకి ఎవరైనా నమస్కరించాల్సిందే. ‘‘అన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాల బొమ్మలు వేశారు కదా. మీకు బాగా నచ్చిన చిత్రం ఏది’’ అని అడిగితే, ఆయన స్టూడియోలో పక్కనే ఉన్న ఒక వర్ణచిత్రాన్ని చూపిస్తారు. అది దువ్వూరి వెంకట రమణశాస్త్రి వాక్‌ చిత్రం ‘‘జానకితో జనాంతికం’’ ఖండికకు బాపు వేసిన బొమ్మ. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఒక పత్రికవారు కోరగా, ముఖ చిత్రంగా వేశారు. ఒక భక్తుడు సీతమ్మ సన్నిధికి వచ్చి, ఆమెని పొగుడుతూ, రాములవారి మీద విమర్శలు మొదలు పెడుతుంటాడు. దువ్వూరి వారి అద్భుతమైన రచన. అయ్యవారి నిలువెత్తు పాదాలు, చెంతనే భక్తుని మాటలు వింటూ అమ్మవారు. దూరంగా భక్తుడు. ఇదీ దృశ్యం. కాని అమ్మవారి ముఖ కవళికలు చూడాలి నిజంగా. రాముడి భావ ప్రభావాలు మనకి కనిపిస్తాయి. బాపు ఎప్పుడూ ‘‘బొమ్మ బాగా వేశాను’’ అనడం ఆఖరికి ఆ రమణ కూడా విని ఉండడు. ‘‘లకీగా బొమ్మ బాగా కుదిరింది’’ అనడం బాపు శైలి. ఇవన్నీ కొని తెచ్చుకున్న వినయాలు కాదు. వృత్తి పట్ల గౌరవం, రాముడిపట్ల భక్తీ భయమూను. అందుకే నా తొలి గురువు రాముడంటూ సీతమ్మ పాదాలకు పారాణి దిద్దే రాముణ్ణి వేసి, బంటులా దోసిలితో రంగులందిస్తున్న బాపుని సభక్తికంగా చిత్రించుకున్నారు. ఆ జంటకి రాముడంటే ఒక మైకం. రాముడు, రామాయణం పేర్లు చెప్పి బాపుని తేలిగ్గా ఏమార్చవచ్చు. ఈ మధ్యనే ఒకాయన విజయవంతంగా ఏమార్చాడు.

బాపు గీసిన ముత్యాల ముగ్గులు, చేయించిన సీతా కళ్యాణాలు...

దర్శకునిగా బాపు ప్రస్థానంలో తొలి చిత్రం ‘సాక్షి’. తరువాత పూర్తి కమర్షియల్‌ సినిమా ‘బుద్ధిమంతుడు’. అక్కినేని తెరమీద ద్విపాత్రభినయమే కాకుండా బయటా బాపు ` రమణలకి అండాదండాగా మరో పాత్ర పోషించారు. బాపు మహాస్టార్స్‌ని కూడా వైనంగా మేనేజ్‌ చెయ్యగలరని పేరొచ్చింది. ‘ముత్యాల ముగ్గు’ ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయి కూచుంటే ‘సంపూర్ణ రామాయణం’ పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. పౌరాణికం తీస్తే, బాపునే తియ్యాలన్నారు ప్రేక్షకులు. ఎన్‌టిఆర్‌తో ‘రామాంజనేయ యుద్ధం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, ఎన్‌టిఆర్‌ ` నాటి ఆనాటి అగ్రశ్రేణి కథానాయకులు బాపు ప్రతిభకి పట్టం కట్టారు. బాపు సారథ్యంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ తెలుగు కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేసింది. చికాగో, లండన్‌, బెర్లిన్‌, శాన్‌రెమొ, డెన్‌వెర్‌ ఫిలిం ఫెస్టివల్స్‌కి వెళ్లింది. లండన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యగ్రంథంగా ఎంపికైంది. జాతీయ అంతర్జాతీయ ఫిలిమ్‌ క్రిటిక్స్‌ ‘‘ ‘సీతాకళ్యాణం’ ఒక దృశ్యకావ్యం’’ అన్నారు. బాపు మాత్రం ‘‘అది ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ లెండి’’ అని హాయిగా పైపులోంచి నవ్వేశారు. అదే బాపుకి శ్రీరామరక్ష. ముఖ్య మంత్రి ఎన్‌టిఆర్‌ ఆదేశం మేరకు ప్రాథమిక విద్యను వీడియో పాఠాలుగా రూపొందించారు. అవి ఎన్‌టిఆర్‌ ఆశించినట్టుగా పిల్లలకు చేరలేదు. చేరిన చోట సత్ఫలితాలిచ్చాయి. బాపు డైరెక్ట్‌ చేసిన రెండు గొప్ప చిత్రాలు ‘మనవూరి పాండవులు’, ‘భక్త కన్నప్ప’. ‘మనవూరి పాండవులు’ సినిమాని 1980లో ‘హమ్‌ పాంచ్‌’ పేరుతో హిందీలో తీశారు. అది బాపు తొలి హిందీ చిత్రం. బొంబాయిలో కూడా బాపు గౌరవం తెచ్చుకున్నారు. తెలుగులో చిరంజీవిని అక్కడ మిథున్‌ చక్రవర్తి పోషించాడు. ‘బేజుబాన్‌’, ‘ప్యారీ బెహనా’, ‘ఓ సాత్‌దిన్‌’, ‘మొహబ్బత్‌’, ‘మేరాధర్మ్‌’, ‘దిల్‌జలా’, ‘ప్రేమ్‌ ప్రతిజ్ఞ’, ‘పరమాత్మ’.. బాపు డైరెక్ట్‌ చేసిన హిందీ సినిమాలు. బొంబాయి తారలు కూడా బాపు దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్లూరేవాళ్లు. అమితాబ్‌ కూడా ఉవ్విళ్లూరిన వారిలో ఉన్నారు. తెలుగులో మళ్లీ బాపు మార్క్‌తో వచ్చిన సినిమాలు ‘పెళ్లిపుస్తకం’, ‘మిస్టర్‌ పెళ్లాం’. బాపు ` రమణలు ఒక మంచి అవకాశంగా భావించి శ్రమించి చేసిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. భారీ తారాగణంతో తాజా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సినిమా. ప్రేక్షకులు బాగానే ఉందన్నారు కాని ముక్తకంఠంతో బాగుందనలేదు. మాటలు అందించిన ముళ్లపూడి వెంకటరమణకి ఇది ఆఖరి చిత్రమైంది. రామభక్తునికి రామకథ కడపటిదైంది. బాపు పనిచేసిన అన్ని చిత్రాలకూ రమణ మాటలే. బాపు తన సినిమా కెరియర్‌లో ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేశారు. బాపు ఎందరో గొప్పవారితో పనిచేశారు. ఇషాన్‌ ఆర్య బాపు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు. బాబా ఆజ్మీని చీఫ్‌ కెమెరామేన్‌గా పరిచయం చేసింది బాపూయే. ఎడిటింగ్‌ సౌండ్‌ రికార్డింగ్‌ శాఖలలో అత్యంత శ్రద్ధ పెట్టి, తనకు కావల్సిన ఫలితాలు రాబట్టుకునేవారు. బాపు క్రమశిక్షణగల కష్టజీవి. ఆయనకు వీలు దొరికితే, ఇంట్లో రోజుకి పది సినిమాలు చూడగలరు. పూర్తి నిడివి సినిమాని ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లో అరగంటలో చూసేస్తారు. హిందూస్థానీ ప్రముఖుల సంగీతం నిరంతరం బాపు స్టూడియోలో వినిపిస్తూనే ఉంటుంది. బడే గులాం, మొహదీహసన్‌లాంటి మహా విద్వాంసుల గజల్సూ, పాటలు వేలగంటలు బాపు సేకరించుకున్నారు. అపురూపమైన ఆర్ట్‌ పుస్తకాలు, ప్రపంచ సినిమా సంగతులు చెప్పే పుస్తకాలు, తెలుగు ఆంగ్ల సాహిత్యం బాపు లైబ్రరీలో నిండుగా ఉంటాయి. వీటన్నిటినీ వింటూ, చదువుతూ పనిలోనే విశ్రాంతి పొందే పద్మశ్రీ బాపు తెలుగు జాతి సిరి సంపద.

....శ్రీరమణ

( గత సంవత్సరం బాబుగారి పుట్టినరోజున శ్రీరమణ గారు రాసిన ఆర్టికల్ ఇది. పునఃముద్రణకు అనుమతించిన శ్రీరమణ గారికి కృతజ్ఞతలు. )

CLICK HERE for సృష్టి క‌ర్త‌... బాపు

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...