English | Telugu

బండ్ల గ‌ణేష్‌పై 420 కేసు..

బండ్ల గ‌ణేష్‌పై చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. అదీ.. ఓ హీరో సంస్థ త‌ర‌ఫునుంచి. స‌చిన్ జోషీతో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రాసుకుపూసుకొని తిరిగాడు బండ్ల గ‌ణేష్. టెంప‌ర్ సినిమాకి బ‌య‌ట నుంచి డ‌బ్బులు పెట్టింది స‌చినే. నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకీ గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నాడు. అయితే ఆ డ‌బ్బులూ స‌చిన్‌వే. ఆ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, స‌చిన్ నిర్మాణ సంస్థ అయిన విల్‌కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ గ‌ణేష్ పై చీటింగ్‌కేసు న‌మోదు చేసింది.

ఆ సినిమాకి సంబంధించిన డ‌బ్బులు చెల్లింపు విష‌యంలో త‌న‌ని మోసం చేశాడ‌ని ఆరోపిస్తున్నాడు స‌చిన్ జోషి. టెంప‌ర్ విష‌యంలోనూ గ‌ణేష్‌.. స‌చిన్‌ని బాగా మ‌భ్య‌పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి... చివ‌రికి న‌ష్టాలొచ్చాయ‌ని త‌ప్పుడు లెక్క‌లు చూపించిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే.. స‌చిన్ గ‌ణేష్‌పై గుర్రుగా ఉన్న‌ట్టు వినికిడి. ఈ విష‌యంపై స‌చిన్ - గ‌ణేష్ ల మ‌ధ్య ప‌లుద‌ఫాలుగా చ‌ర్చ‌లు సాగినా.. గ‌ణేష్ డ‌బ్బులు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో చివ‌రి అస్త్రంగా గ‌ణేష్‌పై చీటింగ్ కేసు పెట్టేశాడు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో, చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.