English | Telugu

రుద్ర‌మ‌దేవిని టెన్ష‌న్ పెడుతున్న బాహుబ‌లి

అనుకొన్న‌ట్టే రుద్ర‌మ‌దేవి వాయిదా ప‌డింది. ఈనెల 26న రావట్లేదు. ఎప్పుడ‌న్న‌ది గుణ‌శేఖ‌ర్ ఇంకా తేల్చ‌లేదు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో ఆల‌స్యం అవుతుంద‌ని గుణ‌శేఖ‌ర్ చెబుతున్నా.. అస‌లు కార‌ణాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా చూసిన బ‌య్య‌ర్లు పెద‌వి విరిచార‌ని టాక్‌. నిడివి ఎక్కువ‌గా ఉంద‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్ అంత‌గా ర‌క్తిక‌ట్ట‌లేద‌ని లూప్ హోల్స్ బ‌య‌ట‌పెట్టార‌ట‌. రూ.60 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని చెబుతున్నా అది తెర‌పై క‌నిపించ‌డం లేద‌ని గుణ‌శేఖ‌ర్‌కి ఫీడ్ బ్యాక్ ఇచ్చార‌ట‌.

దాంతో... గుణ‌శేఖ‌ర్ డైలామాలో ప‌డిన‌ట్టు టాక్‌. ఇప్ప‌టికిప్పుడు మ‌ళ్లీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ మార్చాంటే కుద‌ర‌దు. అందుకే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ మార్చి చూడాల‌ని గుణ‌శేఖ‌ర్ నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. దాంతోపాటు ఈ సినిమాని ఎక్క‌డెక్క‌డ ట్రిమ్ చేస్తే బాగుంటుందో త‌న టీమ్‌తో స‌హా చ‌ర్చిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రుద్ర‌మ‌దేవి ప‌లుసార్లు వాయిదా ప‌డింది. దాంతో ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ ఉన్నా.. అది కూడా మెల్లిమెల్లిగా స‌న్న‌గిల్లుతోంది.

బాహుబ‌లి విడుద‌ల‌య్యాక రుద్ర‌మ‌దేవిని విడుద‌ల చేస్తే.. ఈ రెండు సినిమాల‌కూ జ‌నాలు పోలిక‌లు తీస్తార‌ని, అప్పుడు రుద్ర‌మ‌దేవి తేలిపోతుంద‌ని భ‌య‌ప‌డ్డాడు గుణ‌శేఖ‌ర్‌. ఇప్పుడు ఆ భ‌యాలే నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 26 దాటితో రుద్ర‌మ‌దేవికి అనువైన స్లాట్ దొర‌క‌డం క‌ష్టం. ఈలోగా బాహుబ‌లి విడుద‌ల అయిపోతుంది కూడా. ఈలోగా రుద్ర‌మ‌దేవికి ఇంకాస్త మెరుగులు దిద్ది విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నాడు గుణ‌శేఖ‌ర్‌. అందుకోసం మ‌రో నాలుగైదు కోట్ల ఖ‌ర్చు ఎక్కువైనా వెన‌క‌డుగు వేయ‌కూడ‌ద‌నుకొంటున్నాడ‌ట‌. మొత్తానికి బాహుబ‌లి రుద్ర‌మ‌దేవిని బాగానే టెన్ష‌న్ పెడుతోంది.