English | Telugu

90's వెబ్ సిరీస్ రివ్యూ

90's వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : 90's
నటీనటులు: శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక, స్నేహల్ తదితరులు
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
నిర్మాత : రాజశేఖర్ మేడారం
రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
ఓటీటీ : ఈటీవి విన్

తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెల్లెలిగా నటించిన వాసుకి, శివాజీ కలిసి చేసిన తొలి వెబ్ సిరీస్ 90's.. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది శీర్షిక. శివాజీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో శివన్నగా అందరికి దగ్గరయ్యాడు. మరి అతను చేసిన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ: 

ఓ ఊర్లో లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ (శివాజీ), అతని భార్య రాణి(వాసుకీ ఆనంద్) ముగ్గురు పిల్లలు  రఘు తేజ(మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య(వాసంతిక), ఆదిత్య(రోహన్ రాయ్) లతో సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. చంద్రశేఖర్ గవర్నమెంట్ స్కూల్ లో లెక్కల మాస్టర్ కాబట్టి అతని కుటుంబంలోని పిల్లలు బాగా చదవాలని ఆశపడుతుంటాడు. కొడుకు రఘు పదోతరగతి చదువుతుంటాడు. అతనికి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చంద్రశేఖర్ ఆశపడతాడు. మరోవైపు రఘ తన క్లాస్ మేట్ అయినటువంటి సుచిత్ర(స్నేహల్ కామత్) మధ్య ఏం జరిగింది? ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూల్స్ పిల్లలపై ఎలాంటి ఒత్తిడిని క్రియేట్ చేశాయి? చంద్రశేఖర్ కొడుకు రఘు ర్యాంక్ సాధించాడా తెలియాలంటే ‌ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. 

విశ్లేషణ:

తొంభై దశకంలో పిల్లలు, పెద్దలు ఎలా ఉన్నారు వారి జీవనశైలీ, విద్య ఎలా సాగిందో కళ్ళకి కట్టినట్టు చూపించడంలో దర్శకుడు ఆదిత్య హాసన్ విజయం సాధించాడు. తొంభైల్లో పుట్టినవారికి ఈ సిరీస్ ఎన్నో జ్ఞాపకాలనిస్తుంది. ప్రతీ సీన్ మళ్లీ తమ లైఫ్ లోకి తొంగిచూసేలా చేశారు మేకర్స్.

ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఆణిముత్యం. మనకి పిల్లలు పుట్టి రేపు పొద్దున మనం చూసిన..  మన రోజుల్ని తిరిగి గుర్తుకుతెచ్చేలా చేశారు. మొదటి ఎపిసోడ్ .. వంద రూపాయలు. ముప్పై రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో డీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇంటికి ఎవరైన చుట్టాలు వస్తే ఎలా ఉంటుందో అదే సిచువేషన్ ఈ ఎపిసోడ్ లో చూపించారు. నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్తే బాగుండనిపిస్తుంది. రెండవ ఎపిసోడ్.. సిగ్నేచర్. నలభై నిమిషాల నిడివితో ఈ ఎపిసోడ్ సాగుతుంది. మనకి స్కూల్లో ఎగ్జామ్స్ కి ప్రొగ్రెస్ కార్డ్ ఇచ్చి, ఇంట్లోని అమ్మనాన్నలతో సిగ్నేచర్ చేపించమంటారు కదా.. అదే ఇందులో చూపించారు. కాస్త నిడివి ఎక్కువగా ఉన్నా ఆ క్యారెక్టర్, ఎమోషన్స్ కి అలా సాగిపోతుంది.

మూడవ ఎపిసోడ్.. రాట్రేస్. ఇరవై మూడు నిమిషాల నిడివి ఉంటుంది. కానీ ఏదో అయిదారు నిమిషాల్లో ముగిసిన ఫీల్ కలుగుతుంది. మార్కుల కోసం, పిల్లల చదువు కోసం ఓ తండ్రి డిస్కస్ తోటి టీచర్స్ తో మాట్లాడే విధానం అందరిని ఎమోషనల్ గా టచ్ చేస్తుంది‌. అప్పటి జనరేషన్ వారికే కాదు ప్రస్తుతం సమాజంలో విద్యార్థుల చదువుని, వారి మార్కుల కోసం ఇంట్లోవాళ్ళు పడే ఆవేదనని తెలియజేస్తూ కట్టిపడేస్తుంది. 

ఒక మిడిల్ క్లాస్ లో కుటుంబాన్ని పోషించే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇంట్లోని ఖర్చులని బేరీజు వేస్తూ ఓ తల్లి తమ పిల్లలకోసం శ్రమించే సీన్లని, ఉప్మా ఈజ్ ఎమోషన్ అంటూ తీసిన ఈ ఎపిసోడ్ చివరలో కంటతడిపెట్టిస్తాయి. చివరి రెండు ఎపిసోడ్ ల నిడివి కాస్త ఎక్కువగా ఉందనిపిస్తుంది‌. మిగతా ఎపిసోడ్ లన్నీ అప్పుడే అయిపోయాయా అనిపిస్తాయి. చంద్రశేఖర్, అతని పిల్లల అభిరుచులు, అలవాట్లు, చదువు అన్నీ కూడా అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులని చెప్తూ ఎన్నో మధుర స్మృతులను ఇస్తాయి.

కూతిరికి చీరకట్టించడానికి మిడిల్ క్లాస్ తండ్రి పడే కష్టాలని బాగ చూపించారు. ఇక చివరి ఎపిసోడ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి అందరు కనెక్ట్ అవుతారు. ఎక్కడ అడల్ట్ సీన్స్ లేవు.  ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ అండ్ మేకప్ టీమ్ కి స్పెషల్ గా మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పటి డ్రెస్సింగ్, ఆ డీటేలింగ్ అన్నీ కూడా చాలా చక్కగా తెరపై కన్పించేలా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే .. అవును మాకు ఇలానే ఉండేదని తొంభైల్లో పుట్టినవారికి అనిపించేలా చేశారు. అజీమ్ అహమ్మద్‌ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ నీట్ గా ఉంది. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

లెక్కల మాస్టార్ గా చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఆకట్టుకున్నాడు. ఇక రాజశేఖర్ కి భార్య పాత్రలో రాణిగా వాసుకి ఒదిగిపోయింది. రఘు పాత్రలో మౌళి నటన చాలా నేచురల్ గా ఉంది. ఆదిత్య పాత్రలో చేసిన రోహన్ కడుపుబ్బా నవ్వు తెప్పించాడు. 

తెలుగువన్ పర్ స్పెక్టివ్:  

కుటుంబసమేతంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. తొంభైల్లో ఉన్నవారి జీవనశైలీని రిక్రియేషన్ చేయడంతో వారికి ఈ సినిమా ఓ మధుర జ్ఞాపకాలని గుర్తుచేస్తుంది. 


రేటింగ్ :  3 / 5

✍️. దాసరి  మల్లేశ్