English | Telugu
విజయశాంతిని సూపర్ స్టార్ గా నిలబెట్టిన 'ప్రతిఘటన'కు 40 ఏళ్ళు!
Updated : Oct 11, 2025
తెలుగు సినీ చరిత్రలో 'ప్రతిఘటన' చిత్రానికి ప్రత్యేక స్థానముంది. విజయశాంతి ప్రధాన పాత్రలో టి.కృష్ణ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా.. 1985 అక్టోబర్ 11న విడుదలై సంచలనం సృష్టించింది. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. నటీనటుల గొప్ప నటన, అద్భుతమైన కథాకథనాలు, మాటలు, పాటలు కలిసి ఈ సినిమాని గొప్పగా మలిచాయి. ఇందులోని 'ఈ దుర్యోధన దుశ్శాసన' పాట ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా ఏకంగా ఆరు నంది అవార్డులతో సత్తా చాటింది. ఉత్తమ నటిగా విజయశాంతి, ఉత్తమ విలన్ గా చరణ్ రాజ్, ఉత్తమ గాయనిగా ఎస్.జానకి, ఉత్తమ కథా రచయితగా టి.కృష్ణ, ఉత్తమ మాటల రచయితగా హరనాథ్ రావుతో పాటు కోట శ్రీనివాసరావు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఇలా ఎన్నో సంచనాలు సృష్టించిన 'ప్రతిఘటన' చిత్రం, నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతి, సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
"1985 అక్టోబర్ 11.....
2025 అక్టోబర్ 11....
నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం.
నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ "ప్రతిఘటన".
దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి, అద్భుతమైన "ఈ దుర్యోధన దుశ్శాసన" పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావు గారికి, సహ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు." అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.