English | Telugu

`బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`గా కృష్ణంరాజు అల‌రించి నేటికి 38 ఏళ్ళు!

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితంలో ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌` ఒక‌టి. గోపీకృష్ణా మూవీస్ ప‌తాకంపై కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న సోద‌రుడు ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ రాజు నిర్మించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ సెన్సేష‌న్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, కృష్ణంరాజుకి `ఉత్త‌మ న‌టుడు`గా ఇటు `నంది` పుర‌స్కారాన్ని, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందించింది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌, మాట‌లు అందించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డ‌మే కాకుండా `ఉత్త‌మ ద‌ర్శ‌కుడు`గా తొలి `నంది`ని సొంతం చేసుకున్నారు.

గ్రామీణ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందిన `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`లో బ్ర‌హ్మ‌న్న‌గా, ర‌విగా కృష్ణంరాజు ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. శార‌ద‌, జ‌య‌సుధ నాయిక‌లుగా న‌టించారు. రావుగోపాల‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్ ప్ర‌సాద్, అన్న‌పూర్ణ‌, ముచ్చ‌ర్ల అరుణ‌, కృష్ణ‌వేణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌మందించిన ఈ చిత్రంలో ``చ‌లిగాలి వీచింది``, ``అబ్బా నాతో``, ``త‌ద్దిన‌క త‌ద్దిన‌క మ‌ల్లెలు తెచ్చా``, ``ఓ రాతి మ‌నిషి``, ``బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న వీర గాథ‌లు`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ అల‌రించాయి. 1984 మే 25న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`.. నేటితో 38 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.