English | Telugu
మెగాస్టార్ `చాణక్య శపథం`కి 35 ఏళ్ళు!
Updated : Dec 18, 2021
మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన తొలి, మలి చిత్రాలు `అడవి దొంగ` (1985), `కొండవీటి రాజా` (1986) బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ రెండు సినిమాల తరువాత వచ్చిన `చాణక్య శపథం`.. ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా ఫర్లేదనిపించుకుంది. ఇందులో కస్టమ్ ఆఫీసర్ చాణక్యగా చిరంజీవి అభినయించగా.. ఎయిర్ హోస్టెస్ శశిరేఖ పాత్రలో చిరుకి జోడీగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దర్శనమిచ్చారు. రావు గోపాల రావు, సత్యనారాయణ, అన్నపూర్ణ, సుధాకర్, సుత్తి వేలు, కాంతారావు, రంగనాథ్, చలపతి రావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
దిగ్గజ సంగీత దర్శకుడు చక్రవర్తి బాణీలు అందించిన ఈ సినిమాలో ``మెల్లగా అల్లుకో`` పాట చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``సోకు తోటలో``, ``నీ బండ బడ``, ``వరి వరి వరిచేలో``, ``వేడి వేడి వలపులు`` గీతాలు కూడా రంజింపజేశాయి. డీవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డీవీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన, కె.యస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. 1986 డిసెంబర్ 18న జనం ముందు నిలిచిన `చాణక్య శపథం`.. నేటితో 35 వసంతాలు పూర్తిచేసుకుంది.