English | Telugu

17 వేల కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమా గురించి మీకు తెలుసా?

ఎన్నో జోనర్స్‌లో సినిమాలు తయారవుతూ ఉంటాయి. అయితే హారర్‌ జోనర్‌ అనేది ఎవర్‌గ్రీన్‌. ఈ జోనర్‌లో ఎప్పుడు సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే ఆడియన్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంగేజ్‌ చేయగలిగిన సినిమాకే మంచి ఫలితం లభిస్తుంది. హారర్‌ జోనర్‌ సినిమాలు మొదట హాలీవుడ్‌లోనే మొదలయ్యాయి. ది ఆమెన్‌, ఈవిల్‌ డెడ్‌, పోల్టర్‌గీస్ట్‌, ఎక్జార్సిస్ట్‌ వంటి సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా భయపెట్టాయి. ఈ సినిమాలు ఇండియాలోనూ ఘనవిజయం సాధించాయి. 1981లో హాలీవుడ్‌లో విడుదలైన ఈవిల్‌ డెడ్‌ అతి భయానకమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాను ఇండియాలో థియేటర్లలో రిలీజ్‌ చెయ్యలేదు. ముంబాయిలోని ఒక థియేటర్‌లో మాత్రమే దీన్ని ప్రదర్శించారు. 1980 దశకంలో వీడియో పార్లర్ల హవా ఎక్కువగా నడిచింది. ఈ సినిమాను వీడియో పార్లర్స్‌లోనే ప్రేక్షకులు చూశారు. హైదరాబాద్‌లోని ఒక పార్లర్‌లో ‘ఈవిల్‌ డెడ్‌’ చిత్రాన్ని దాదాపు 5 సంవత్సరాలు ప్రదర్శించారు.

సినిమాలకు సంబంధించి కొన్ని జోనర్స్‌కు కాలం చెల్లినట్టుగా అనిపిస్తుంది. కానీ, హారర్‌ జోనర్‌లో వచ్చిన సినిమాలను మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణగా ‘ది కంజూరింగ్‌’ సిరీస్‌ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్‌ 2013లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. 20 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా 320 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఈ సిరీస్‌లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసేవారు. అలా ఇప్పటివరకు వచ్చిన నాలుగు భాగాలూ ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఐదో భాగం, చివరి భాగం ‘ది కంజూరింగ్‌.. లాస్ట్‌ రైట్స్‌’ 2025 సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతోంది. ఈ ఐదు సినిమాల్లో 3 సినిమాలకు జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించారు. విశేషం ఏమిటంటే.. ఈ సిరీస్‌లోని నాలుగు సినిమాలను 1800 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 17000 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. రాబోతున్న 5వ భాగం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.