English | Telugu

జనవరిలో వైఎస్ జగన్ కొత్త పార్టీ? వైసీపీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటీ?   

ఆంధ్ర ప్రదేశ్ లో పెను సంచలనాలు జరగబోతున్నాయా? జనవరిలో వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? జగన్ కొత్త పార్టీ పెడితే ప్రస్తుత వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవిష్యత్ ఏంటీ? ఇదేంటీ.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడమేంటని అశ్చర్యపోతున్నారా... తమాషా చేస్తున్నారని భావిస్తున్నారా.. కాని ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో ఎవరూ ఊహించని సంచలన పరిణామాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ పార్టీగా చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన కేసులో జనవరిలో కోర్టు తీర్పు రాబోతోంది. ఆ తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టేనని చెబుతున్నారు.


ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ కూడా జగన్ పెట్టింది కాదు. హైదరాబాద్ కు చెందిన కొలిశెట్టి శివకుమార్ రిజిస్టర్ చేసుకున్న పార్టీ. 2011లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శివకుమార్ నుంచి ఈ పార్టీని జగన్ తీసుకున్నారు. దీని వెనక కూడా పెద్ద స్టోరీనే ఉంది. అయితే శివకుమర్ నుంచి ఎన్నో అష్టకష్టాలు పడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని తీసుకుని నడిపిస్తున్న జగన్ కు మరో కొత్త , సవాల్ లాంటి సమస్య వచ్చింది. అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కంటే ముందే రిజిస్టర్ అయిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. శివకుమార్ కంటే ముందే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర అన్న వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ రిజిస్టర్ అయి ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడే ఇప్పుడు కోర్టుకు ఎక్కారు. వైఎస్సార్ పేరు వాడుకునే అర్హత తమ పార్టీకే ఉందని ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనే జనవరిలో తీర్పు రాబోతోంది.

కర్నూల్ జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని మహబూబ్ బాషానే అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. వైఎస్సార్ పై అభిమానంతో 2009 సెప్టెంబర్ లో అన్న వైఎస్సార్ పేరుతో ఆయన పార్టీని రిజిస్టర్ చేయించారు. మహబూబ్ బాషా పార్టీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాల్వాయి వేణు అనే నాయకుడు ఉన్నారు. ఈ పార్టీనే ఇప్పుడు వైఎస్ జగన్ కు నిద్ర లేకుండా చేస్తోందని చెబుతున్నారు. 2009లో మహబూబ్ బాషా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేస్తే.. 2010లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని శివకుమార్ రిజిస్టర్ చేశారు. నిజానికి వైఎస్సార్ పేరుతోనే పార్టీ పెట్టాలని వీళ్లిద్దరూ భావించారు. కాని వ్యక్తుల పేరుతో పార్టీలు ఉండకూడదన్న సీఈసీ రూల్స్ తో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అని ఒకరు.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరుతో మరొకరు పార్టీలు రిజిస్టర్ చేసుకున్నారు.

అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మొదట జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మహబూబ్ బాషా కోర్టులో పిటిషన్ వేశాక వైసీపీ నేతల్లో అలజడి రేగిందని చెబుతున్నారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఒక రాష్ట్రంలో ఒకే పేరుతో రెండు పార్టీలు ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే మొదట రిజిస్టర్ అయిన పార్టీకే ఎన్నికల సంఘం గుర్తింపు వస్తుంది. గతంలో తమిళనాడులో ఇలాగే జరిగింది. డీఎంకే, అన్నాడీఎంకే విషయంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే అక్కడ డీఎంకే నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి పెద్ద సమస్య కాలేదు. కాని ఏపీలో మాత్రం పార్టీ గుర్తింపు ముందు ఎవరికి దక్కుతుందన్నదే సమస్య. ఈ లెక్కన ముందుగా రిజిస్టర్ అయిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే కోర్టు తీర్పు రావచ్చని రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఇప్పుడు జగన్ అధ్యక్షుడిగా ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పోతోంది. అదే జరిగితే వైసీపీ భవిష్యతే ఆగమ్య గోచరంగా తయారవుతుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దయితే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటన్న చర్చ వస్తోంది. వారి సభ్యత్వాలు ఉంటాయా పోతాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది.

జనవరిలో రానున్న కోర్టు తీర్పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే పెద్ద ఇబ్బంది లేదు. అదే వ్యతిరేకంగా వస్తే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద గండమే. అందుకే ముందు జాగ్రత్తగా కొత్త పార్టీ పెట్టాలని జగన్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. కొత్త పార్టీని రిజిస్టర్ చేయించి.. ఇప్పుడు నడిపిస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అందులో విలీనం చేసే ఆలోచన జగన్ చేస్తున్నారని సమాచారం. దీనిపై పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిధులతో సీఎం జగన్ సంప్రదింపులు జరుపుతున్నారని వైసీపీ వర్గాల నుంచే తెలుస్తోంది. మొత్తంగా వైఎస్సార్ అభిమాని మహబూబ్ బాషా పెట్టుకున్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుందని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో.. తర్వాత ఏం జరగబోతుందోనన్న ఆసక్తి జనాల్లోనూ పెరుగుతోంది.

- గోశాల ప్రసాద్