English | Telugu
ఉగాదికి పేదలకు ఇళ్ల స్ధలాల వ్యవహారంలో ట్విస్ట్.. రంగంలోకి జగన్ టీమ్
Updated : Feb 25, 2020
వచ్చే ఉగాది నాటికి ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న వైసీపీ సర్కారుకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. పలు జిల్లాల్లో ప్రభుత్వ స్ధలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్దలాలను కొనుగోలు చేయడం, గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేసి మరీ తాజాగా వాటిని సేకరించడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో భూసేకరణ కోసం క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. మరోవైపు సమయం కూడా తక్కువగా ఉన్నందున సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నేరుగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నారు.
ఏపీలోని వివిధ జిల్లాలో దాదాపు పాతిక వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి 25 లక్షల పేదలకు ఉగాది సందర్భంగా ఒక్కో సెంటు చొప్పున పంచేందుకు వైసీపీ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవరత్నాలు- పేదలకు ఇళ్ల స్ధలాలు పథకం కింద చేపడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాల్లో భూసేకరణలో పలు ఇబ్బందులు తలెత్తాయి. అనుకున్న స్ధాయిలో ప్రభుత్వ భూముల లభ్యత లేకపోవడంతో గతంలో పేదలకు ఇచ్చిన స్ధలాల్లో ఇళ్లు నిర్మించని వాటని వెనక్కి తీసుకుని తిరిగి వారికే ఇచ్చే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. దీంతో పేద ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. భూసేకరణ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పలు జిల్లాల్లో రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడే పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
మందుగా అనుకున్న ప్రకారం ఉగాది నాటికి భూసేకరణ పూర్తయితే కానీ పథకం అమలు చేయడం సాధ్యం కాదు. దీంతో తాజా పరిస్ధితిపై మంగళవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్… క్షేత్రస్ధాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఏకంగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇతర కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోక్య రాజ్ వంటి వారికి పలు జిల్లాల బాధ్యతలను సీఎం అప్పగించారు. నీలం, ప్రవీణ్ ప్రకాష్ లకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించిన సీఎం... అజయ్ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను, ఆరోక్య రాజ్ కు రాయలసీమ జిల్లాలను, ధనుంజయరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలను కేటాయించారు. ఆయా జిల్లాల్లో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేయడం వీరి బాధ్యత.
మార్చి 1 నాటికి ఇళ్ల స్ధలాల కోసం భూములన్నీ పొజిషన్ లోకి తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ కు టార్గెట్ పెట్టారు. ప్లాట్లు మార్కింగ్ చేస్తే వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలని వారికి సూచించారు. భూసేకరణలో జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఎవరి ఉసురూ తగలకుండా చూడాలని సైతం సీఎం జగన్ కోరారు. కలెక్టర్లు ఉదారంగా వ్యవహరించాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పదేపదే కోరారు.