English | Telugu

‘గ్రేటర్’ఎన్నికల్లో...  ‘కమలం’ చెవిలో వైసీపీ పువ్వులు?

‘కారు’కే జైకొట్టాలని సోషల్ మీడియాలో వైసీపీ పిలుపు

బీజేపీకి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు

హల్‌చల్ చేస్తున్న రెండు వాట్సాప్ క్లిప్పింగులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైఎస్సార్‌సీపీ, ఏపీలో తనకు దన్నుగా నిలిచిన ‘కమలం’ పార్టీ చెవిలో పువ్వులు పెడుతోంది. అర్ధం కాలేదా?.. గ్రేటర్ ఎన్నికల్లో నగరంలోని వైఎస్-జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలంతా టీఆర్‌ఎస్ కారు గుర్తుకే వేసేలా చూడాలని నిర్ణయించారట. యస్.. వైసీపీకి చెందిన రెండు సోషల్‌మీడియా గ్రూపులు, ఈపాటికే తన విధానాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కే వైసీపీ కార్యకర్తలు-అభిమానులంతా ఓటు వేయాలంటూ.. ఆ పార్టీకి చెందిన రెండు సోషల్‌మీడియా గ్రూపులు, వాట్సాప్ ద్వారా పంపిస్తున్న సందేశాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మేరకు ఆ గ్రూపు సభ్యుల చాటింగ్, వారి సందేహాలకు వైసీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టుల సమాధానాలు చర్చనీయాంశమయ్యాయి.

ఆ ప్రకారంగా... నగరంలోని వైసీపీ-జగన్ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటివరకూ బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, తాజాగా ‘పైనుంచి’ వచ్చిన ఆదేశాల ప్రకారం.. వారంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని నిర్ణయించినట్లు, ఆ చాటింగ్ సారాంశం స్పష్టం చేస్తోంది. జనసేనకు హైప్ రాకూడదని, కేసీఆర్ వైసీపీ గెలుపునకు సహకరించారని అందులో వివరించారు. అయితే వైసీపీ, టీఆర్‌ఎస్‌కు సపోర్టు చేసినందువల్ల మనకేమి లాభం అని ఓ వైసీపీ కార్యకర్త ప్రశ్నించారు.

అందుకు... బీజేపీ తర్వాత టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని, జనసేన తోడు ఉంటే తమ పార్టీ మీద ఇప్పుడున్న వ్యతిరేకతకు రాబోవు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని మరొక పెద్దారెడ్డిగారు, అసలు విషయం వివరించారు. అందుకే టీఆర్‌ఎస్‌కు సపోర్టు ఇవ్వాలన్నారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ప్రచారంతో పార్టీని ఎక్కువకాలం నిలపలేమని హితబోధ చేశారు. ఇది ఒక వాట్సాప్ గ్రూపు నుంచి వచ్చిన సందేశం.

మరొక వాట్సాప్ గ్రూపులో.. నవీన్ గారూ, జగన్‌గారి ఆదేశాల మేరకు మనవాళ్లందరినీ టీఆర్‌ఎస్‌కు సపోర్టు చేయమని చెప్పండని సూచించారు. అయితే.. ఇప్పటికే మనవాళ్లంతా బీజేపీకి సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నారని, అటువైపు నుంచి సందేశం ఉంది. ఆంధ్రావాళ్లున్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవలసిన అవసరం ఉందన్నారు. అయితే, మనవాళ్లందరినీ బీజేపీకి సపోరు చేస్తున్నామని చెబుతూనే, టీఆర్‌ఎస్ గెలుపు కోసం పనిచేయాలని చెప్పాలని సూచించారు. రేపు మార్నింగ్ మీటింగుకు మన కోఆర్డినేటర్లను పదిన్నరకల్లా అటెండ్ అవ్వాలని చెప్పమన్నారు. ఇప్పటికే మనవాళ్లంతా బీజేపీకి సపోర్టు చేస్తున్నందున, వారికి ఇకపై టీఆర్‌ఎస్‌కు పనిచేయమని చెబుతామని హామీ ఇచ్చారు. అయితే.. మనవాళ్లంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు, బయట ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తగా పనిచేయండని ఆ నాయకుడు.. తమ కార్యకర్తలను హెచ్చరించడం ఆ చాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

కాగా...గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ అభిమానులు తొలుత, బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, దివంగత మహానేత వైఎస్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలతో.. వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే.. వారి తాజా సందేశాలను పరిశీలిస్తే, బీజేపీపై ఏపీ కన్నేయడం ఖాయం ఖాయమన్న నిర్ణయానికి, వైసీపీ వర్గాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, దాని దూకుడు హైదరాబాద్‌తోనే ఆగిపోతుందన్న భావన-అంచనా ఆ సందేశాల్లో పరోక్షంగా కనిపించింది. అదీకాకుండా, వైసీపీ సోషల్‌మీడియా వర్గాలు, పవన్ కల్యాణ్ జనసేనకు ఎక్కువగా భయపడుతున్నట్లు వారి చాటింగ్ సారాంశం చెబుతోంది.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రేటర్‌లో వైసీపీ టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని, బీజేపీకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడాలని హెచ్చరించారు దీన్నిబట్టి... ఒకవైపు వైసీపీకి, టీఆర్‌ఎస్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, మరోవైపు బీజేపీపై భయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ రెండు గ్రూపుల చాటింగ్ నిజమో-అబద్ధమో ఎవరికీ తెలియదు. కానీ, అందులోని వ్యక్తుల సంభాషణ చూస్తే మాత్రం, వారంతా కరుడుగట్టిన వైసీపీ మద్దతుదారులుగానే అనిపిస్తోంది. ఏదేమైనా.. ఇది టీఆర్‌ఎస్‌కు శుభవార్తనే!

-మార్తి సుబ్రహ్మణ్యం