English | Telugu
వ్యక్తిగత ఫిజియో థెరఫిస్ట్ కు ఎంపీ టికెట్! కేసీఆర్ బాటలో జగన్
Updated : Nov 20, 2020
డాక్టర్ గురుమూర్తి సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్. జగన్ సుదీర్ఘ పాదయాత్ర సమయంలో గురుమూర్తి జగన్ వెన్నంటి ఉన్నారు. జగన్ కాళ్లకు డాక్టర్ గురుమూర్తే పట్టి కట్టారు. పాదయాత్రలో జగనే వెంటే ఉంటూ ఆయనకు సపర్యలు చేశారు. అందుకే గురుమూర్తికి తిరుపతి ఎంపి టికెట్ ఇస్తున్నారని చెబుతున్నారు. తిరుపతి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో ఉంటారన్న విషయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తన స్నేహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఈ విషయంలో జగన్ స్పూర్తిగా తీసుకున్నారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. తనకు టైమ్ కు టాబ్లెట్ ఇచ్చిన సంతోష్ రావును కేసీఆర్ రాజ్యసభ కు పంపారని, ఆయన బాటలోనే తన కాలుకు పట్టి కట్టిన డాక్టర్ గురుముర్తికి ఏపీ సీఎం జగన్ తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తున్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో దుర్గాప్రసాద్ కుటుంబానికి జగన్ మోసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ చనిపోయినా.. తర్వాత ఆ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో వారి కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎక్కువసార్లు అలానే జరిగింది. గతంలో అయితే ఎవరైనా పదవిలో ఉండగా చనిపోతే.. ఆ స్థానంలో అతని కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. అయితే ఇటీవల కాలంలో ఆ సంప్రదాయం పోయింది. అయితే ఏకగ్రీవం కాకున్నా.. చనిపోయిన నేత కుటుంబసభ్యులకే ఆయా పార్టీలు టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే భార్యనే పోటీలో పెట్టింది టీఆర్ఎస్. నిజానికి ఆమె అభ్యర్థిత్వం అధికార పార్టీకి అక్కడ మైనస్ అయిందనే చర్చ ఉంది. అయినా గత సంప్రదాయం పాటిస్తూ దివంగత ఎమ్మెల్యే కుటుంబానికే కేసీఆర్ అవకాశం ఇచ్చారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో మాత్రం జగన్ ఇవేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా హైదరాబాద్‌లో ఉంటోన్న పారిశ్రామికవేత్త మధు పేరు మొదట తెరమీదకు వచ్చింది. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం కాకుండా మరో అభ్యర్థిని నిలబెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో వైసీపీ వెనక్కి తగ్గిందని, దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తికే టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. ఇటీవలే తిరుపతి ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు జగన్. అభ్యర్థి ఎంపిక అధికారాన్ని సీఎంకే కట్టబెడుతూ వారంతా తీర్మానించారు. దీంతో పాదయాత్ర సమయంలో.. తన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి అవకాశమివ్వాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో తిరుపతిలో వైసీపీకి అభ్యర్థే దొరకలేదు. దీంతో టీడీపీలో ఉన్న దుర్గాప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు టికెట్ ఇచ్చారు జగన్. తన అవసరం కాబట్టి అప్పుడు దుర్గాప్రసాద్ ను వాడుకున్నారని, ఇప్పుడు అవసరం తీరింది కాబట్టి ఆయన కుటుంబాన్నివదిలించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దుర్గాప్రసాద్ ను అవసరానికి వాడుకుని ఇప్పుడు సొంత మనిషికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా జగన్ అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.