English | Telugu
వైజాగ్‌లో కరోనా హైఅలర్ట్... కేజీహెచ్‌కు కేంద్ర వైద్య బృందం...
Updated : Feb 11, 2020
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోయినా జనాన్ని మాత్రం భయపెడుతోంది. అయితే, కరోరా వైరస్ పై రెండు తెలుగు రాష్ట్రాలూ కరోనాపై ముందుజాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తత పాటిస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోరా వైరస్ గుర్తింపు పరికరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రయాణికుడిని పరీక్షిస్తున్నారు. అయితే, ఇఫ్పటివరకు పలువురిని అనుమానితులుగా భావించి పరీక్షలు చేసినా ఒక్కరికీ కూడా పాజిటివ్ రాకపోవడంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఊపిరిపీల్చుకుంటోంది.
మరోవైపు, ఏపీలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖలో కరోనాపై అలర్ట్ ప్రకటించారు. అలాగే, అతిపెద్ద పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం... పైగా ఉత్తర భారత్ నుంచి రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఐసోలేషన్ కోసం మూడు పడకలను సిద్ధంగా ఉంచారు.
అయితే, ఇప్పటివరకు కరోనా కేసులేమీ నమోదు కాలేదని విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే, కరోనా అత్యంత ప్రమాదకారి కావడంతో అన్ని ముందుజాగ్రత్తలు చేపట్టామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి కర్ఛీఫ్ లేదా ఫేస్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
ఇక, విశాఖ కేజీహెచ్ లో కరోనా వైరస్ ముందస్తు ఏర్పాట్లను కేంద్ర వైద్యోరాగ్యశాఖ ఉన్నతస్థాయి బృందం పరిశీలించనుంది. కేజీహెచ్ అండ్ ఐడీ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఏపీ వైద్యారోగ్యశాఖ చేపట్టిన సన్నద్ధత చర్యలను పరిశీలించనున్నారు. కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించడంతోపాటు ఇంకా ఏమైనా ముందస్తు చర్యలు అవసరమైతే కేంద్ర వైద్య బృందం సూచించనుంది.