English | Telugu
తెలంగాణలో భయపెడుతోన్న ఫోన్ కాల్స్...
Updated : Dec 2, 2019
తెలంగాణలో ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగులు తెగ భయపెడుతున్నాయి. ఇదేదో ఒకరిద్దరి సమస్య కాదు... ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగ్ భయంతో వణికిపోతున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్... కలెక్టర్ అహ్మద్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడం... అది వివాదాస్పదం కావడంతో... ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోన్లో మాట్లాడాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ఇక, కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే అసలు లిఫ్ట్ చేయడమే మానేస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చినా పొడిపొడిగా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక, తెలిసినవాళ్ల నుంచి ఫోన్ వచ్చినాసరే నమ్మకం కుదరక అటు ప్రజాప్రతినిధులు... ఇటు అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఎంతవరకు మాట్లాడాలో... ఏది మాట్లాడాలో... అదే మాట్లాడి... మమ అనిపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతుండటం... పైగా ఆటోమోటిక్ కాల్ రికార్డింగ్ ఆన్ లో పెట్టుకోవడం కామన్ గా మారడంతో పొరపాటున ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే మెడకు చుట్టుకుందనే భయం ప్రజాప్రతినిధులను, అధికారులను, రాజకీయ నేతలను వెంటాడుతోంది.
ఇక, ప్రజల నుంచి కానీ, కార్యకర్తల నుంచి గానీ... ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నేతలకు కాల్స్ వస్తే... నేరుగా వచ్చి కలవాలంటూ ఫోన్ పెట్టేస్తున్నారు. చివరికి, ఏదైనా సమాచారం కోసం జర్నలిస్టులు ఫోన్ చేసినా సరే కార్యాలయానికే రావాలంటూ చెబుతున్నారు. ఇక, పొలిటికల్ లీడర్స్ అయితే... తమ అనుచరులను కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చిస్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా నోరు జారకుండా మాట్లాడాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే ముఖాముఖిగా కలిసి మాట్లాడటం... లేదంటే వాట్సప్ కాల్ చేయడమో చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్... కలెక్టర్ అహ్మద్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడం... అది మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించేనంటూ ప్రచారం జరగడం... పైగా బండి సంజయ్ అనుచరుల్లోనే ఎవరో ఒకరు... ఆ ఆడియోను లీక్ చేశారన్న టాక్ రావడం... అలాగే కలెక్టర్ అహ్మద్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో... తెలంగాణలో అధికార యంత్రాంగంతోపాటు పొలిటికల్ లీడర్స్ అందరూ ఫోన్ కాల్స్ పై జాగ్రత్త పడుతున్నారు.
అయితే, చిన్న పిల్లవాడి వరకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫోన్ రికార్డింగ్ బాధలు తప్పడం లేదు. ఫోన్లో ఏవైనా సీక్రెట్ మాట్లాడుకోవాలన్నా... వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా... పొరపాటున నోరు జారినా అన్ని రికార్డు కావడమే కాకుండా... సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో స్నేహితులు, కోలీగ్స్, బంధువులతో కుశల ప్రశ్నలతోనే సరిపెడుతున్నారు. పొరపాటున అవతలివాళ్లను నమ్మి కాస్త మనసు విప్పి మాట్లాడితే ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో వెనక్కి తగ్గుతున్నారు. మొత్తానికి ఫోన్ ... ఇప్పుడందరినీ అలా భయపెడుతోంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.