English | Telugu

ఖాకి నీడలో విజయవాడ.. టీడీపీ కీలక నేతల గృహ నిర్బంధం

ఏపీ రాజధాని మార్పు పై అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించటంతో రాజధానికి భూమిలిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ తమకు తోచిన విధంగా నిరసనలు చేపట్టారు. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, పలు ప్రజా సంఘాలు ఆ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం ఖాకి నీడలో ఉంది. విజయవాడ నగరం లోని కేశినేని నాని, బుద్ధా వెంకన్న వంటి ముఖ్య టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఐతే దీనిపై కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. నాపై రౌడీ షీట్ ఉందా లేక క్రిమినల్ కేసులు ఉన్నాయా అని అయన పోలీసుల పై మండి పడ్డారు. ఎంపీగా ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లకుండా ఎలా ఆపుతారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ఢిల్లీ, బెంగళూరులో లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియ చేశారని... వారిని ఎవరు ఆపారని అయన పోలీసుల తీరును ప్రశ్నించారు.