English | Telugu
పిన్ బాల్ విజేత.. టైం పాస్ కోసం ఆడిన ఆట జాతీయ గుర్తింపు తెచ్చింది
Updated : Nov 15, 2019
ఆట అందలమెక్కించింది. రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి పెట్టింది. పిన్ బాల్ క్రీడా పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిపింది. విజయవాడకు చెందిన అబ్దుల్ మజీద్ ఇలా పతకాలు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఇప్పుడు సాధన చేస్తున్నాడు.
విజయవాడకు చెందిన అబ్దుల్ ముజీబ్ ఆటో నగర్ లో ఆటో మొబైల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. మూడు దశాబ్దాలుగా ఇదే రంగం పై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు సరదాగా పిన్ బాల్ ఆడుతూ ఉండేవాడు. అలా కాలక్షేపంగా ఆడుకున్న ఆట కొత్త మార్గమైంది. గురి తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తుండడంతో ఆటపై ఆసక్తి పెరిగింది. స్నేహితులు.. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించటంతో వివిధ స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆటపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఇక అప్పటి నుండి వీలున్నప్పుడల్లా విజయవాడలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పిన్ బాల్ సెంటర్ లకు వెళ్లి సాధన చేసేవాడు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేశాడు.
ఇలా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మూడు రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతగా నిలిచి కప్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన పోటీలలో తలపడిన రెండుసార్లు కూడా మొదటి స్థానం సాధించాడు. ఇటీవల చెన్నై లో జరిగిన నాలుగు రాష్ట్రాల పిన్ బాల్ పోటీలలో అద్భుతమైన ప్రదర్శనతో అబ్దుల్ ముజీబ్ అందరిని ఆకట్టుకున్నాడు. 20 టీమ్స్ ఈ టోర్నీలో తలపడగా సింగిల్స్ లో ప్రథమ స్థానం సాధించటంతో పాటు డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన వివేక్ సింగ్ తో ఆడి విజేతగా నిలిచాడు. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి ఛాంపియన్ గా అవతరించటమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు అబ్దుల్ ముజీబ్ చెబుతున్నారు. ఆటవిడుపు అనుకున్న ఆట జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుందని అనుకోలేదని.. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెస్తానని అన్నాడు.