English | Telugu
రాములమ్మకు సిగ్నల్ రాలేదా! ఆ సెంటిమెంటే భయపెడుతోందా?
Updated : Nov 26, 2020
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే విజయశాంతితో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ జిల్లాకు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాములమ్మ దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు. దీంతో అప్పుడే ఆమె బీజేపీలో చేరతారని భావించారు. కాని ఎందుకో ఆమె జాయినింగ్ ఆగిపోయింది. దుబ్బాకలో రఘునందన్ రావు విజయంతో ఆమె బీజేపీలో చేరడం ఖాయమనుకున్నారు. అది కూడా జరగలేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందు విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఈనెల 14న రాములమ్మ ఢిల్లీకి వెళుతున్నారని, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కాని ఆమె ఢిల్లీ వెళ్లలేదు.. బీజేపీలో చేరలేదు. గ్రేటర్ పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా విజయశాంతి కమలం గూటి చేరే ముహుర్తం ఇంకా ఫిక్స్ కాలేదు.
బీజేపీలో విజయశాంతి చేరిక ఆలస్యమవుతుండగా.. శాసనమండలి చైర్మెన్ స్వామి గౌడ్ ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ బీజేపీలో చేరడం.. ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా విజయశాంతి ఇంకా జాయిన్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి బీజేపీలో చేరుతారని రాష్ట్ర నేతలు కూడా చెబుతూ వస్తున్నారు. కాని ముహుర్తం ఫిక్స్ చేయడం లేదు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరికపై కొత్త చర్చలు మొదలయ్యాయి. విజయశాంతి పార్టీలో చేరికకు బీజేపీ హైకమాండ్ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు.
రాజకీయాల్లో విజయశాంతికి ఐరెన్ లెగ్ అనే ప్రచారం ఉంది. ఆమె ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతుంటారు. 2009లో విజయశాంతి టీఆర్ఎస్ లో చేరగా.. ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. 56 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 10 ఎమ్మెల్యే సీట్లనే గెలుచుకుంది. కేసీఆర్ తో పాటు ఆమె మాత్రం ఎంపీలుగా విజయం సాధించారు. 2014లో రాములమ్మ కాంగ్రెస్ లో చేరగా.. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు విజయశాంతిని ప్రచార కమిటి చైర్మెన్ గా నియమించింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కథ మారలేదు. దీంతో విజయశాంతి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మంచి ఫలితాలు రావనే సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి చేరికపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. విజయశాంతికి ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర కమలనాధులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో చేరితే వ్యతిరేక ఫలితాలు వస్తాయోమనన్న ఆందోళన కొందరు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. అందుకే గ్రేటర్ ఎన్నికల తర్వాతే విజయశాంతిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించిందని చెబుతున్నారు.