English | Telugu

ఎవరికి ఏం చెప్పాలో అదే చెబుతా... రాజధాని రగడపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజధానిని తరలించొద్దంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న అమరావతి రైతులు, కుటుంబాలు... ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. రాజధానిని తరలిస్తే అమరావతి కోసం భూములిచ్చిన తమ పరిస్థితేంటని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మోడీ భూమిపూజ చేసిన చోట రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తుంటే తమ నిద్ర పట్టడం లేదని... కనీసం అన్నం కూడా సహించడం లేదని అమరావతి రైతులు, మహిళలు... ఉపరాష్ట్రపతికి తమ బాధను చెప్పుకున్నారు. రాజధాని వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరిన రైతులు... ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా కేంద్రంతో ప్రకటన చేయించాలని కోరారు.

అయితే, తాను రాజకీయాలు మాట్లాడకూడదంటూ అమరావతి రైతులు, మహిళలకు నచ్చజెప్పిన వెంకయ్యనాయుడు... మీ బాధను అర్ధం చేసుకోగలను.... ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందో అది జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు... దేశ భవిష్యత్ కు ఏది మంచిదో అదే చేస్తానని... ఎవరికి ఏం చెప్పాలో అదే చెబుతానని భరోసా కల్పించారు. అయితే, తాడేపల్లిగూడెం నిట్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.... అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కేవలం జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరముందన్నారు. అయితే, తన వ్యాఖ్యలను ప్రస్తుతం ఏపీలో వికేంద్రీకరణ రగడతో ముడిపెట్టొద్దని సూచించారు.