English | Telugu

సీఎం జగన్ పై అసంతృప్తి.. ఎమ్మెల్యే వంశీ పాలిటిక్స్ కు గుడ్ బై..!

గన్నవరం నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ రాజకీయాలపై వైరాగ్యం చూపుతున్నారు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా మారిన వంశీకి నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. అయితే కొందరు తనపై గొడవలు సృష్టించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై వైసీపీ అధిష్ఠానం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వంశీ ఆరోపించారు. దీంతో రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నియోజకవర్గంలోని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు ఓ వైపు, దుట్టా రామచందర్ రావు మరో వైపు టీడీపీ నుండి వచ్చి చేరిన ఎమ్మెల్యే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా వారు బహిరంగంగానే వంశీకి సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయబోనని తాను ఇప్పటికే సీఎం జగన్ కు చెప్పినట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. వంశీ తనను, తన అనుచరులను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన చెప్పారు. వైసీపీ కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని వెంకటరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే వంశీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.