English | Telugu

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత.. రేపు పాట్నాలో అంత్యక్రియలు

కేంద్ర మంత్రి, లోక్ జన్‌ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్‌ పాశ్వాన్‌ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు.

పాశ్వాన్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ 12 జన్‌పథ్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం పాట్నకు తరలించనున్నారు. పట్నాలోని లోక్‌జనశక్తి పార్టీ ఆఫీసులో మద్దుతుదారులు, అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు అంటే శనివారం పట్నాలో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

రామ్‌విలాస్ పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇది తనకు మాటలకందని విషాదమని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఆయన లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.