English | Telugu

కేంద్రమంత్రి షెకావత్‌ కు కరోనా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా?

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎందరో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడగా.. తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు ఐసోలేషన్‌ లో ఉండి, ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని షెకావత్‌ సూచించారు.

ఇదిలా ఉండగా.. షెకావత్‌ కు కరోనా రావడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొనే జల వివాదాలను పరిష్కరించడానికి వీలుగా అపెక్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి చైర్మన్‌ హోదాలో షెకావత్‌ అధ్యక్షత వహించాల్సి ఉంది. సభ్యులుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్న ఈ సమావేశం.. షెకావత్‌ కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వాయిదా పడే అవకాశముంది.