English | Telugu

'ట్విట్టర్ కిల్లర్' కు మరణశిక్ష విధించిన కోర్టు

జపాన్‌లో తకాహిరో షిరాయిషి(30) అనే ఓ సీరియల్ కిల్లర్ కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. ఇతడికి 'ట్విట్టర్ కిల్లర్' అని పేరుంది. ట్విట్టర్ లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతే ఇతడి టార్గెట్. బాధను తనతో పంచుకోమంటూ మొదట ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగిస్తాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమారుస్తాడు. వారి శరీరాన్ని ముక్కముక్కలు చేసి పైశాచిక ఆనందం పొందుతాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని షిరాయిషి అంతమొందించాడు. వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక పురుషుడు ఉన్నారు. వారంతా 26 ఏళ్ల లోపు వారే. 2017లో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం.. అప్పట్లో జపాన్ లో సంచలనం సృష్టించింది.

కాగా, కోర్టులో వాదనల సందర్భంగా షిరాయిషి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చనిపోయిన వారందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారేనని, అందువల్ల షిరాయిషికి యావజ్జీవ శిక్ష విధించాలని, మరణశిక్షను తొలగించాలని విన్నవించాడు. అయితే కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. చనిపోయిన వారు ఎవరూ కూడా మరణించాలని కచ్చితంగా నిర్ణయించుకోలేదని, ఇతడికి మరణశిక్షే సరైదని తీర్పు వెలువరించింది. షిరాయిషికి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించడంపై బాధితుల కుటుంబాలు హర్ష వ్యక్తం చేశాయి.