English | Telugu

జగన్ బెయిలుపై విడుదలై నేటికి పుష్కరం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 12 ఏళ్లయ్యింది. అంటే పుష్కరకాలం అన్న మాట. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు ఇవ్వడంతో 2013 సెప్టెంబర్ 24న ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అంతకు ముందు ఆయన దాదాపు 16 నెలల పాటు జైలులో ఉన్నారు. జగన్ పై ఐపీసీ, యాంటీకరప్షన్ యాక్ట్ కింద అభియోగాలు నమోదయ్యాయి. నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం, ఫోర్జరీ వంటివి ఉన్నాయి.

క్విడ్ ప్రోకో పె ద్వారా ఆయన పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నది ఆ కేసుల సారాంశం. 2019 ముందు వరకూ అంటే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేంత వరకూ కోర్టు బెయిలు మంజూరు చేసిన సందర్భంగా విధించిన షరతులను పాటించారు. అయితే సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత అధికారిక విధులు కారణంగా చూప్తిస్తూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఆ తరువాత 2024 ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆ మినహాయింపు అలాగే కొనసాగుతున్నది.

జగన్ పై సీబీఐ కేసులు పదకొండు, అక్రమాస్తులకు సంబంధించి ఈడీ కేసులు 9 ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాదు. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. పార్టీ అధినేత అన్నది పక్కన పెడితే జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా కేసుల విచారణకు వ్యక్తిగత మినహాయింపు కొనసాగుతుండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.