English | Telugu

కటకటాలలో దసరాను గడపబోతున్న రవిప్రకాష్..

నిధుల దుర్వినియోగం వ్యవహారంలో అరెస్ట్ అయిన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ దసరా తరువాత జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పండగ మూడు రోజులూ ఆయన జైలులో గడపక తప్పని పరిస్థితి నెలకొంది. కంపెనీ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన నిధులని సొంత అవసరాలకు వాడుకున్నారు. అది కూడా వెయ్యి, రెండు వేలు కాదు, ఏకంగా పధ్ధెనిమిది కోట్ల రూపాయలు అడ్డగోలుగా డ్రా చేశారన్నది టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఆరోపణ. నిధులు దుర్వినియోగం చేయడమేకాక రికార్డుల్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ తో పాటు మరో ఉద్యోగి అయిన ఎంకెబిఎన్ మూర్తిని అరెస్టు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

టీవీ 9 కు మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీసీఎల్ కు గతంలో రవిప్రకాశ్, ఎంకెబిఎన్ మూర్తి హోల్ టైమ్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో సంస్థ రోజువారీ అవసరాలకు మాత్రమే బ్యాంకు ఖాతాల నుంచి నిధులను ఉపయోగించే అధికారం రవిప్రకాశ్, ఎంకెబిఎన్ మూర్తీలకు ఎబిసిఎల్ ఇచ్చింది. అయితే వాళ్ళిద్దరూ చెక్ పవర్ ను దుర్వినియోగం చేశారని, అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన తర్వాత కంపెనీ లావాదేవీలను ఆడిటింగ్ చేయించటంతో రవిప్రకాశ్, మూర్తి చేసిన అక్రమాలు బయటపడ్డాయి అంటోంది అలందా మీడియా. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ తో పాటు ఎంకెబిఎన్ మూర్తి పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని గత నెల ఇరవై నాలుగున జరిగిన బోర్డు మీటింగ్ లో అలందా మీడియా నిర్ణయించింది. దీనిలో భాగంగానే సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫెరీరా కూడా కంపెనీ నిధులను గోల్ మాల్ చేసినట్లు పోలీసులకు అలందా మీడియా తెలిపింది. ఆ డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది.

కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి లేకుండానే రవిప్రకాష్ బృందం మొత్తం పధ్ధెనిమిది కోట్ల రూపాయలు డ్రా చేసింది. ఇందులో రవిప్రకాశ్ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు విత్ డ్రా చేయగా, ఎంకెబిఎన్ మూర్తి క్లిఫర్డ్ పెరీరా చెరో ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల దారిమళ్లించినట్టు ఆడిటింగ్ లో బయటపడింది. అయితే ఈ మొత్తాన్ని కంపెనీ ఖాతాలో బోనస్ ఎక్స్ గ్రేషియాగా చూపించింది రవిప్రకాష్ బృందం. ఈ క్రమంలో రవిప్రకాష్ ను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. తర్వాత వైద్య పరీక్షలు చేయించి సీతాఫల్ మండిలోని నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు రవిప్రకాశ్ బెయిల్ కు దసరా పండుగ అయ్యే వరకూ బెయిల్ దొరికే సూచనలు కనిపించటం లేదు. అతని బెయిల్ పిటిషన్ పై ఈ నెల తొమ్మిదిన విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పండుగ మూడు రోజులు ఆయన జైలులోనే గడపనున్నారు.