English | Telugu
బస్సు డిపోల వద్ద ఉద్రిక్తత.. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు!!
Updated : Nov 26, 2019
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా అన్ని డిపో పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. దీంతో పలు డిపోల ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది.. తోపులాటలు జరుగుతున్నాయి. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందుకు డిపోలకు చేరుకుంటున్నారు. అధికారుల నుండి ఎటువంటి అనుమతి లేకపోవడంతో డిపోలకు చేరుకుంటున్న కార్మికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. డిపో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాత్రి నుండే డిపోల ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భారీగా కార్మికులు డిపోకు చేరుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రాష్ట్రంలోని 96 డిపోల ముందు టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం ఐదు గంటల నుండే డ్రైవర్ లు.. కండక్టర్ లు.. డిపోల వద్దకు చేరుకున్నారు. సమ్మె విరమించి కార్మికులు ముందుకు వస్తున్నా.. తమకు ప్రభుత్వం నుండి కానీ ఆర్టీసీ ఎండీ నుండి కానీ ఎలాంటి ఆదేశాలు లేవని వెల్లడిస్తున్నారు డిపో అధికారులు. నిన్న సునీల్ శర్మ చేసిన ప్రకటనలో డ్యూటీలోకి తీసుకోవద్దంటూ మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. 52 రోజులు సమ్మె చేసి..తరువాత సమ్మె విరమించి తిరిగొచ్చిన వారిని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేని పక్షాణ ఏ ప్రొఫార్మ మీద సంతకం పెట్టించుకోవాలని సునీల్ శర్మ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మె డ్రైవర్లు.. కండెక్టర్లు.. డిపో చుట్టూ పక్కల పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రైవేటు డ్రైవర్ లు తాత్కాలిక డ్రైవర్ లు క్యూ కూడా పెద్ద సంఖ్యలో డిపో దగ్గరకు వచ్చి చేరారు. ఈరోజు నుండి ప్రైవేటు డ్రైవర్లను దయచేసి మానేయాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు ఆర్టీసీ డ్రైవర్లు. అయినా వారి మాటలను పట్టిచుకోకుండా పెద్ద ఎత్తున క్యూ కట్టారు ప్రైవేట్ డ్రైవర్లు. ఇక కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది.