English | Telugu
ఉద్యమకారులకే పదవులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రశంసలు
Updated : Nov 21, 2019
నలుగురు ఒక దారిలో వెళుతుంటే.. ఆ దారి నాకెందుకు, నా దారి రహదారి అనుకునే వాళ్ళను చూశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం కూడా అలానే ఉంటుంది. తెలంగాణలో మిగతా చోట్ల టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ టాక్ వస్తే.. చొప్పదండిలో మాత్రం పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. అదే రాష్ట్రమంత ఆ పార్టీ అధిష్టానానికి పాజిటివ్ ఉంటే చొప్పదండిలో మాత్రం నెగిటివ్ టాక్ ఉంటుంది. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి అంటే వివాదాస్పదమైన నియోజకవర్గంగా పేరుంది.
ఇక్కడ ఎప్పుడు ఎవరు రెచ్చిపోతారో ఎవరు సైలెంట్ గా ఉంటారో తెలియదు. సోషల్ మీడియా కూడా ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. మార్కెట్ కమిటీల్లో.. ఉద్యమం నుంచి పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇస్తున్నారని సభావేదికల మీద ఎమ్మెల్యే రవిశంకర్ ను కార్యకర్తలు ఆకాశానికెత్తుతున్నారు. వాస్తవంగా రాష్ట్రం మొత్తం మీద టిఆర్ఎస్ అధిష్టానం ఉద్యమకారులను పక్కన పెట్టిందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ముందు నుండి పార్టీ జెండా మోసిన వారిని కాకుండా ఉద్యమానికి ద్రోహం చేసిన నేతలను చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ను బాగా విమర్శించిన వారికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని స్వపక్షీయులే గగ్గోలు పెడుతూ వస్తున్నారు. కొన్నాళ్ల నుంచి బీటీ బ్యాచ్ వర్సెస్ బ్యూటీ బ్యాచ్ అంటూ జోరుగా చర్చ కూడ సాగుతోంది. ఇలా రాష్ట్రమంతటా అసలైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న చర్చ జరుగుతుంటే చొప్పదండిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గంలో ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారన్న పాజిటివ్ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు.
గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకట్ రెడ్డిని నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రి గంగుల కమలాకర్ ను కూడా పిలిపించారు. వేదిక మీద ఆరు మండలాల ప్రజా ప్రతి నిధుల మధ్య పలువురు ఉద్యమకారులను సన్మానించారు. మరోవైపు గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరో ఉద్యమకారుడు మహిపాల్ రావుకు అవకాశమిచ్చారు. గంగాధర మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రుల కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు. ఉద్యమకారునికి పెద్ద పీట వేశారని వేదిక మీద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను నేతలు పొగిడారు. ఇక మల్యాల మండలంలోని ఉద్యమకారుడు జనగాం శ్రీనివాస్ కు మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం కూడా ఎమ్మెల్యే రవిశంకర్ కు మంచి పేరు తెచ్చింది. మొత్తం మీద చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నియోజకవర్గంలో ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులే పడ్డాయన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే శాసన సభ ఎన్నికల ముందు సుంకె రవిశంకర్ కోసం కష్టపడ్డ ఇంకా కొంతమంది ఉద్యమకారులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే పదవులు రాని మండలాల్లో ఉన్న సీనియర్ కార్యకర్తలు కూడా ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని వారు కాంక్షిస్తున్నారు. ఏదేమైనా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీసుకున్న నిర్ణయాన్ని మిగతా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే అసలైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా టీఆర్ఎస్ అధిష్ఠానం పెద్దలు ఎమ్మెల్యేలు నడుస్తారో లేదో చూడాలి.