English | Telugu
పడవ కొనాల్సిందే! వరదలపై హైదరాబాదీల సెటైర్లు
Updated : Oct 19, 2020
హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలకు భాగ్యనగరంలో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. నగరంలో వందలాది కాలనీలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. సిటీలోని రోడ్లు, వీధులు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. నీటిలో చిక్కుకున్న వారికి పడవల ద్వారా సహాయక చర్యలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాల్లో నెటిజన్‌లు ఫన్నీ మీమ్స్ క్రియోట్ చేసి వైరల్ చేస్తున్నారు.
ఒక వ్యక్తి తన కారును ఏకంగా తాడుతో ఇంటి గేటుకు కట్టేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో తడి, పొడి చెత్త కోసం రెండు బుట్టలను ఇచ్చినట్లు.. ఈ సారి ఒక తాడు, చైన్‌ను ఇస్తే బాగుంటుంది అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, పాపం వరద నీటితో తన కారును కొట్టుకొని పోకూడదని అతడు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటన్నా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇక భారీ వర్షాలు అంటూ వాతావరణశాఖ హెచ్చరికతో ముందు జాగ్రత్తగా ఇలా తాడుతో కట్టేశారని మరికొంతమంది అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి గురించి సినీ నటుడు బ్రహ్మాజీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఇంటిలోకి నీరు చేరిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్న... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి తెలపండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు బ్రహ్మాజీ.
హైదరాబాద్‌లో భీభత్సం సృష్టిస్తున్న వరదలపై హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల వాసులు వరదల కారణంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో నేను అందుబాటులో లేనందుకు చాలా బాధగా ఉంది. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నా.. తొందరగా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను.." అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు.. మేము కూడా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.