English | Telugu

కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో హైద‌రాబాద్‌!

ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌కు కట్టడి చేసే వ్యాక్సిన్ రూపకల్పనకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా, అమెరికా, ఇజ్రాయెల్, క్యూబా, భార‌‌త‌ శాస్త్రవేత్తలు అహర్నిశలు వ్యాక్సిన్ త‌యారీకి శ్ర‌మిస్తున్నారు.

క‌రోనా కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే రేసులో భారత్ నుంచి ఆరు ఔషధ సంస్థలు బరిలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నుంచే మూడు ఉండటం విశేషం. భారత్ నుంచి కరోనా టీకాల (వ్యాక్సిన్‌) తయారీకి ప్రయత్నిస్తున్న ఆరు ఔషధ సంస్థల్లో మూడు తెలంగాణవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని ఔషధ సంస్థలే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా తయారీలో.. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్‌, బయోలాజికల్‌ ఇ, జిడస్ కాడిలా, మైన్‌వాక్స్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆరు భారతీయ సంస్థలు బరిలో ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు.

అమితాబ్‌ కాంత్‌ ప్రస్తావించిన ఈ 6 సంస్థల్లో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఇ, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్.. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నాయంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.

‘భారత్ ఇప్పటికే టీకాల తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా (గ్లోబల్ వ్యాక్సిన్ హబ్) ఉంది. భారత్ అతి తక్కువ ధరలకే టీకాను అందుబాటులోకి తీసుకురావాలి, ప్రపంచం నుంచి కరోనాను తరిమికొట్టాలి’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు.