English | Telugu
ఎడారి దేశాల బాట పడుతున్న తెలంగాణ వాసులు.. ఆసరా కలిపించండి కేసీఆర్!
Updated : Nov 5, 2019
ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది ఉపాధి కోసం ఎడారి(గల్ఫ్) దేశాల బాట పడతారు. కనీసం ప్రతి గ్రామంలో రెండు వందల మందికి పైనే ఎడారి దేశంలో ఉంటారు. అక్కడికి వెళ్లిన వాళ్లలో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులే ఉంటారు. సొంత ఊరిలో ఉపాధి లేక.. ఏజెంట్ చేతిలో లక్షలు పోసి ఎడారి దేశం వెళ్తున్నారు ఇక్కడ చెప్పే పని ఒకటి అక్కడ చేయించే పని మరొకటి. ఇక్కడ చెప్పే జీతానికి అక్కడ ఇచ్చే జీతానికి పొంతన కూడా ఉండదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎడారి దేశాల్లో కార్మికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఆ గ్రామం లో ఇంటికొకరు ఎడారి దేశం వెళ్లారు. కొందరు సగం జీవితం అక్కడే గడిపారు. పని లేక పోతే పస్తులున్నారు. కంపెనీ టార్చర్ తట్టుకున్నారు. కారణం ఉన్న ఊరిలో ఉపాధి లేక చేసిన అప్పు లు తీర్చలేక నరకం అనుభవించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామం. గ్రామంలో ఆరు వందల యాభై కుటుంబాలు ఉంటాయి. అయితే ఒక్కో ఇంటి నుంచి ఒకరు.. కొన్ని ఇళ్లల్లో ఇద్దరూ.. మరికొన్ని ఇళ్ళల్లో అయితే ముగ్గురు కూడా ఉపాధి కోసం ఎడారి దేశం బాట పడుతున్నారు. దాదాపు ముప్పై ఏళ్లు గా వీళ్లకు ఎడారి దేశాలే దిక్కు.కుటుంబాలను పోషించాలన్నా.. నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లాలన్నా.. వీరికి మరో అవకాశం లేదు. పోతారం గ్రామస్థులు దాదాపు 12 దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. ఇప్పుడు కూడా వెళుతూనే ఉన్నారు. భవన నిర్మాణాల్లో, పెట్రోల్ బంకుల్లో, హోటల్ లో మున్సిపాలిటీలలో పనికి కుదురుతారు. కొందరైతే బాత్ రూంలు కూడా కడుగుతారు. ఏదైనా పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు గాయపడి మరణించిన వాళ్ళ పరిస్థితి దారుణం అని చెప్పుకోవాలి. వాళ్ల డెడ్ బాడీలు తీసుకురావటానికి నెలలు పట్టేది. మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు నరకం అనుభవించేవారు. ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్లి చనిపోతే ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తాయి. హడావిడి చేసి మృతదేహాన్ని స్వదేశానికి వెంటనే రప్పిస్తాయి. కానీ ఎడారి దేశాల్లో కార్మికులు చనిపోతే ఎవరూ పట్టించుకోరు. వాస్తవానికి చదువుకున్న వారికంటే ఎక్కువ సహాయం కార్మికులకు ఇవ్వాలి. ఎన్నారై పాలసీ అమల్లోకి తెస్తే బావుంటుందని కోరుతున్నారు కార్మికులు. ఈ బాధలు ఒక్క పోతారం గ్రామానికే కాదు అన్ని తెలంగాణ పల్లెల్లోనూ అంతే.. అక్కడికి వెళ్ళిన వాళ్లంతా ఉపాధి కోల్పోయి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా పని దొరకడం లేదు. ప్రభుత్వమే రుణాలు ఇప్పించి ఆదుకోవాలని వాళ్లంతా కోరుతున్నారు. ప్రాజెక్టులు పూర్తయి నీళ్లొస్తే వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తామని అంటున్నారు.