English | Telugu

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. గురువారం (నవంబర్ 20) నుంచి ఆదివారం (నవంబర్ 23) వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 23) తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల సవరణకు షెడ్యూల్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి జరగనున్న ప్రజాపాలన వారోత్సవాల అనంతరం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టుగా కసరత్తు ప్రారంభించింది.