English | Telugu

కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు.. తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత, అదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు కేవలం 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దీని పై వెంటనే సమగ్రమైన నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణాలో పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు.. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో స్పష్టంగా చెప్పాల‌ని కోరింది. ప్ర‌భుత్వ ఆస్ప‌‌త్రుల్లో సిబ్బంది పెంపు, ఇత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై కూడా పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని సూచించింది. తాము వివరణ కోరిన అంశాల‌న్నింటిపైనా ఈ నెల 22వ తేదీలోగా నివేదిక‌లు ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ తప్పుడు రిపోర్టులు ఇస్తే మ‌రోసారి ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిని మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చ‌రించింది. ఈ పిటిషన పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.