English | Telugu

తెలంగాణాలో ఆస్తి పన్ను... కరెంటు ఛార్జీలూ పెంచుతార‌ట‌!

విద్యుత్‌ పంపిణీ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదంటున్నారు సి.ఎం. కేసీఆర్‌. ఇదే సమయంలో పేదలకు భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతార‌ట‌. 24 గంటలు కోతలు కరెంటు ఇస్తున్నప్పుడు ఛార్జీల పెంపు తప్పదు. పన్నులు చెల్లించే స్తోమత ఉన్న వారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తాం అని చెబుతున్నారు సి.ఎం.సార్‌.

లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదు. ఇంటి కొలతలు ఆ యజమానులే అందిస్తారు. దీని ప్రకారమే పన్ను విధింపు ఉంటుంది. ఒకవేళ ఇందులో అక్రమాలు జరిగితే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధిస్తాం. రూ.లక్ష అక్రమం జరిగితే, రూ.25 లక్షల జరిమానా వేస్తాం.

పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్ను పెంపు తప్పదని తేల్చి చెప్పారు. ఆరు నూరైనా కొత్తగా తెచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ ఈ చట్టం తెచ్చినట్లు తెలిపారు.

ఒకవేళ ఇందులో ఆలసత్వం ప్రదర్శిస్తే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2020-21 ఏడాదిలో 23 కోట్లకుపైగా మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. 45 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా తప్పకుండా నిధులు విడుదల చేస్తాం. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20 వరకూ ఉన్నాయి. వీటిలోనూ ఐదేళ్లలో రూ.40 లక్షలు వస్తాయి. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ.25 కోట్ల విరాళం ఇచ్చారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచుల పదవులు పోతాయి. గెలిచిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి’’ అని కేసీఆర్ హెచ్చరించారు.