English | Telugu

వీఆర్వో వ్యవస్థ రద్దు.. రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు!

తెలంగాణలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన భావిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే వీఆర్‌వో వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు.

ఇప్పటికే వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం కల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని, రిపోర్ట్‌ పంపాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశించారు.

అయితే, దీనిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేం ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.