English | Telugu

ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన గల్లా జయదేవ్

లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందంటూ.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందజేశారు. కాగా, ఇటీవల అమరావతి రైతులకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి గల్లా జయదేవ్ యత్నించినప్పుడు పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన చొక్కా చినిగిపోవడమే కాకుండా, ఒంటిపై స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ అంశంపై గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా... తనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.