English | Telugu
ఏపీ డిప్యూటీ సీఎం లేఖపై హైకోర్టు సీరియస్.. అంతా మీ ఇష్టమేనా?
Updated : Feb 4, 2020
"దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు" అని రజినీకాంత్ డైలాగ్ చెప్పినట్టుగా.. "ఉపముఖ్యమంత్రి చెప్పాడు, నేను చేస్తాను" అంటూ ఓ జాయింట్ కలెక్టర్.. సామాన్యులపై ప్రతాపం చూపించాడు. చివరికి హైకోర్టు చేత అక్షింతలు వేయించుకున్నాడు. ‘కింద పేర్కొన్న రేషన్ షాపులను రద్దు చేయండి. వాటిని నేను సూచించిన వారికి ఇవ్వండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి లేఖ రాశారట. ఇంకేముంది, ఉప ముఖ్యమంత్రి లేఖతో జాయింట్ కలెక్టర్, మిగతా అధికారులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెదకంటిపల్లిలో పి.మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్ షాపు అనుమతిని గతేడాది డిసెంబరు 2న రద్దు చేశారు. రేషన్ షాపు నిర్వహణలో లోపాలున్నాయని, అందుకే రద్దు చేశామని చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని, తాను వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా రేషన్ షాపు రద్దు చేసారంటూ మోహనాంబ హైకోర్టు గడప తొక్కారు. తన రేషన్ షాప్ రద్దు చేయాలని ఉపముఖ్యమంత్రి రాసిన లేఖను సైతం ఆమె కోర్టు ముందుంచారు.
‘‘ మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్ షాపులో అధికారులు తనిఖీ కూడా చేయలేదు. ఆమె దుకాణాన్ని రద్దు చేయాలని గంగాధర నెల్లూరు తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీనికి ఉప ముఖ్యమంత్రి లేఖే కారణం’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మొత్తం ముగ్గురు డీలర్లను మార్చి, వారి స్థానంలో తాను సూచించిన వారిని ఎంపిక చేయాలని ఉపముఖ్యమంత్రి స్పష్టంగా పేర్లతో సహా సిఫారసు చేసినట్లు ఆ లేఖలో ఉందని తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి మంచి రాజకీయ నాయకుడని, లేఖపై సంతకం ఆయనదే కానీ, ఏం సిఫారసు ఉందో ఆయనకు తెలియదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘‘డీలర్‌ను నియమించడానికి లేదా తొలగించడానికి ఒక విధానం ఉంది. ఉపముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఫలానా వ్యక్తిని డీలర్‌గా నియమించాలని సిఫారసు చేయకూడదు’’ అని కాస్త గట్టిగానే చెప్పారు. అధికారులు నాయకుల కనుసన్నల్లో కాదని, నిబంధనల మేరకు నడచుకోవాలని హితవు పలికారు.