English | Telugu
యాభైవ రోజుకు చేరుకున్న రాజధాని ఆంధోళన.. రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన...
Updated : Feb 5, 2020
అమరావతి రైతుల ఆందోళనలు యాభైవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా ఈరోజు కూడా రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మరోవైపు తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్ పై టిడిపి అధినేత తీవ్ర విమర్శలు చేశారు. అయితే గతంలో రైతుల్ని అన్యాయం చేసి ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసిపి మండిపడింది. రాజధాని వికేంద్రీకరణపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తమ పార్టీ ధర్మం కోసం పోరాడుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో మాట్లాడిన ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు 37 మంది చనిపోయారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు చంద్రబాబు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారాయన.
అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు తనను తెనాలి రానివ్వనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పై మండిపడ్డ బాబు ఈ పిల్ల కుంక నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అంటూ ప్రశ్నించారు. మరోవైపు రాజధాని రైతుల్ని రెచ్చగొట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని వైసిపి మండిపడింది. కేవలం రియల్ ఎస్టేట్ కోసమే గతంలో ఇక్కడ భూసేకరణ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజధాని రైతులతో కలిసి వెళ్ళిన ఆయన వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. రాజధాని రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటు రాజధాని వికేంద్రీకరణపై రైతుల పోరాటం మొదలుపెట్టి నేటికి యాభై రోజులు అయ్యింది, ఈరోజు కూడా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు.