English | Telugu
మహానగరాన్ని తలపిస్తున్న మేడారం జాతర...
Updated : Feb 5, 2020
వనమంతా జనమైంది, మహా జాతర ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి బయలుదేరారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పయనమై వస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభమవుతోంది. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం మహానగరాన్ని తలపిస్తోంది. అసలైన జాతర నాలుగు రోజుల పాటు జరగనుంది. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వనదేవతను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే నలభై లక్షల మంది తల్లులను దర్శించుకున్నారు. జాతర నాలుగు రోజుల్లో అరవై లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
భక్తుల కోసం ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది. మేడారంలో భక్తులు తల్లులను దర్శించుకునేందుకు క్యూ లైన్ లు సిద్ధం చేశారు. జంపన్న వాగు స్నానఘట్టాల పొడవునా నాలుగు కిలోమీటర్ల మేర జల్లు స్నానాలకు ఐదు వేల షవర్లు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకునేందుకు పద్నాలుగు వందల కంపార్టుమెంట్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 8400 తాత్కాలిక మరుగు దొడ్లను నిర్మించారు. రాజమండ్రి నుంచి 3500 మంది, వరంగల్ మహానగర పాలక సంస్థ నుంచి 600 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో తమ సేవలు అందిస్తున్నారు. మరోవైపు మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
యాత్రికుల సౌకర్యార్థం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి ఎంటర్ సెక్టోరల్ బృందాలు ప్రతిరోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకుని ఉన్నాయి. మరోవైపు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ సారి కూడా అంచనాలకు మించి వస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సర్వీసు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల ఏడున సీఎం కేసీఆర్ అమ్మలను దర్శించుకోనున్నారు.