English | Telugu

గ్రేటర్ లో బీజేపీ, జనసేన, టీడీపీ ఒంటరి పోరు! ఎందుకోసం.. ఎవరికోసం? 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి. 13 రోజుల్లోనే పోల్ వార్ ముగియనుండంటంతో మహానగరంలో రాజకీయాలు మహా రంజుగా జరుగుతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. గ్రేటర్ లో ప్రస్తుతం జంపింగుల పర్వం జరుగుతోంది. టికెట్ల కోసం కొందరు, పార్టీలు ఇవ్వజూపుతున్న తాయిలాల కోసం ఇంకొందరు.. రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో మరికొందరు వలస బాట పట్టారు. అయితే రాజకీయ నేతల మైండ్ సెటే కాదు పార్టీల ఎత్తుగడలు క్షణక్షణం మారిపోతున్నాయి.

బీజేపీకి జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా ఉంది. గ్రేటర్ సమరంలోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. గ్రేటర్ లో జనసేనకు కేడర్ ఉంది. ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లు ఎక్కువుండే ప్రాంతాల్లో జనసేన ప్రభావం బాగానే ఉంటుంది. పవన్ అభిమానులకు సిటీలో కొదవ లేదు. దీంతో బీజేపీ, జనసేన కలిస్తే కారు పార్టీకి కష్టమేనన్న ప్రచారం కూడా ఉంది. ఈ రెండు పార్టీలు టీడీపీని కూడా తమతో కలుపుకుని పోవచ్చన్న చర్చ జరిగింది. అయితే గ్రేటర్ నోటిఫికేషన్ వచ్చిన రోజే పోత్తుల్లో ట్విస్టులు జరిగాయి. బీజేపీ, జనసేన ఎవరికి వారే సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించాయి.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ముందుగా ప్రకటించారు పవన్ కల్యాణ్. తమకు పట్టున్న దాదాపు 50 డివిజన్లలో పోటీ చేస్తామని, అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రకటించడమే కాదు గ్రేటర్ ఎన్నికల కోసం హెల్ప్ డెస్క్ ను పార్టీ కార్యాలయంలో ప్రారంభించింది జనసేన. పవన్ ప్రకటన తర్వాత స్పందించిన బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని బాంబ్ పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్నబీజేపీ, జనసేన గ్రేటర్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో జనసేనతో బీజేపీకి పొత్తు లేదని సంజయ్ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించగానే జనసేనానిని కలిశారు. చాలా సేపు మాట్లాడారు. పవన్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. జనసేనతో కలిసి ముందుకు పోతామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆయన స్వరం మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు ఆంధ్రా పార్టీగా ముద్ర ఉందని, గ్రేటర్ ఎన్నికల్లో అది తమకు నష్టం కల్గిస్తుందనే భయంతో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తెరపైకి తెచ్చి టీఆర్ఎస్ లబ్ది పొందే అవకాశం ఉందని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి ప్రజల్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ రగిలించిందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు డైసైడయ్యారని తెలుస్తోంది.

జనసేనకు బీజేపీ కటీఫ్ చెప్పడంపై మరికొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో తేడా జరిగిందని చెబుతున్నారు. తమకు 50 డివిజన్లు కావాలని జనసేన కోరిందని, అందుకు బీజేపీ అంగీకరించలేదని కొందరు కమలం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. దుబ్బాక ఫలితం తర్వాత ఇతర పార్టీ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో గ్రేటర్ టికెట్ల కోసం కమలం పార్టీలో పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో 50 డివిజన్లు వదులుకుంటే చాలా మంది నేతలకు పోటీ చేసే అవకాశం రాకుండా పోతుందని, పార్టీలో ముసలం వచ్చే అవకాశం ఉందన్న భయంతోనే జనసేన పొత్తుకు బ్రేక్ వేశారని చెబుతున్నారు. వ్యూహాత్మంగానే రెండు పార్టీలు సొంతంగా పోటీ చేస్తున్నాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించింది. కలిసి పోటీ చేస్తాయని భావించిన మూడు పార్టీలు.. ఒంటరి పోరుకు దిగుతుండటంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. అయితే అన్ని పార్టీలు పోటీలో ఉండటం వల్ల ప్రజా వ్యతిరేక ఓటు చీలి.. అంతిమంగా అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కేసీఆర్ కు ప్రయోజనం కలిగించేందుకే టీడీపీ, జనసేన సొంతంగా పోటీ చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.